గ్యాస్ స్టవ్ విషయంలో జర జాగ్రత్త.. లేకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే..!

మన వంటగదిలో స్టవ్ మంట రంగును గమనించడం ఎంతో అవసరం. నీలం రంగు మంట సురక్షితమైన దహనాన్ని సూచిస్తే, నారింజ లేదా పసుపు రంగు గ్యాస్ సరిగ్గా కాలిపోకపోవడాన్ని చూపిస్తుంది. ఇది గ్యాస్ వృధా, ప్రమాదకరమైన వాయువుల విడుదలకు దారి తీస్తుంది. స్టవ్ మంట రంగు మారినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి.

గ్యాస్ స్టవ్ విషయంలో జర జాగ్రత్త.. లేకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే..!
Stove Flame Colors And Their Meaning

Updated on: Mar 26, 2025 | 8:08 PM

స్టవ్ మంట రంగుపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మన వంటగదిలో ప్రతిరోజూ వాడే స్టవ్ మంట ఎలా వస్తుందో గమనించడం ద్వారా వంట సురక్షితంగా జరుగుతోందా లేదా అనేది అర్థం చేసుకోవచ్చు. మంట రంగులో వచ్చే మార్పులు గ్యాస్ సరఫరా, దహనం విధానం, ప్రమాదాల సూచనగా ఉంటాయి. అందుకే వంట చేసేటప్పుడు స్టవ్ మంట రంగుపై కాస్త శ్రద్ధ పెట్టాలి.

స్టవ్ మంట నీలం రంగులో ఉంటే అది సరిగ్గా కాలుతోందని గ్యాస్ పూర్తిగా దహనం అవుతోందని అర్థం. ఇది వంట సమర్థతను పెంచే మంట. నీలం రంగు మంట వల్ల వంట వేగంగా పూర్తవుతుంది గ్యాస్ వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలను కూడా తగ్గిస్తుంది. అయితే స్టవ్ మంట నారింజ లేదా పసుపు రంగులో ఉంటే అది అసంపూర్ణ దహనాన్ని సూచిస్తుంది. అంటే గ్యాస్ పూర్తిగా కాలిపోవడం లేదు.

మంట నారింజ రంగులో ఉంటే గ్యాస్ వినియోగం ఎక్కువగా అవుతుంది. స్టవ్ చుట్టూ మసి పేరుకుంటుంది అలాగే గిన్నెలు నల్లబడే అవకాశం ఉంటుంది. పైగా దీనివల్ల హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదలై ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. సాధారణంగా గాలి సరఫరా సరిగ్గా లేకపోవడం, బర్నర్‌లో దుమ్ము పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

మరికొన్ని సందర్భాల్లో స్టవ్ మంట బలహీనంగా ఉండొచ్చు. అలా అయితే అది గ్యాస్ సరఫరా సమస్యను సూచిస్తుంది. గ్యాస్ ప్రెషర్ తక్కువగా ఉండడం వల్ల మంట చిన్నదిగా ఉంటే బర్నర్‌లో అడ్డంకులు ఉన్నట్లయితే అది తగినంత వేడి ఉత్పత్తి చేయలేదు. ఇలా జరగడం వల్ల వంట సమర్థత తగ్గుతుంది, ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి సమస్య వస్తే ముందుగా బర్నర్‌ను శుభ్రం చేయాలి గ్యాస్ కనెక్షన్ సరిచూసుకోవాలి. అయినా మారకపోతే నిపుణుడి సహాయం తీసుకోవడం మంచిది.

స్టవ్ ఉపయోగిస్తున్నప్పుడు గ్యాస్ వాసన వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గదిలో గాలి చొరబడేలా చేయాలి. దీపాలు, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయకూడదు. స్టవ్ వద్ద ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుందేమో పరిశీలించి ప్రొఫెషనల్‌ను సంప్రదించడం మంచిది.