నోరూరించే వరల్డ్ ఫేమస్ చికెన్ రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో.. మీ కిచన్‌లోనే నిమిషాల్లో ఇలా చేసుకోండి..
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చికెన్ 65ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో సులభంగా తయారు చేసుకోవచ్చు. బోన్‌లెస్ చికెన్‌కు మసాలాలు, పెరుగు, కార్న్ ఫ్లోర్ కలిపి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. చివరగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపు ఇచ్చి మిరియాల పొడి జోడిస్తే అద్భుతమైన రుచితో చికెన్ 65 రెడీ అవుతుంది.

నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రైతోపాటు.. ఇంకా పలు రకాలుగా వండుకుని తింటారు. చికెన్ రెసిపీలో అద్భుతమైన రుచిగల వంటకం.. చికెన్ 65.. అంతర్జాతీయంగా చికెన్ 65 అనేది ఒక ప్రసిద్ధ స్పైసీ సైడ్ డిష్.. ఇది చాలా మందికి ఇష్టమైన వంటకం. రెస్టారెంట్లకు వెళ్లకుండానే, అదే రుచిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చు.. ఇది భోజనానికి లేదా రాత్రి డిన్నర్ కు అద్భుతమైన ఎంపిక.. రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ 65 ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి..
చికెన్ 65 తయారీకి కావలసిన పదార్థాలు:
- బోన్ లెస్ చికెన్: 1/2 కిలో (చికెన్ ఇంకా తీసుకుంటే.. క్వాంటిటీకి అనుగుణంగా పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి)
- ఉప్పు: రుచికి సరిపడా
- కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు (లేదా సాధారణ కారం)
- పసుపు: 1/2 టీ స్పూన్
- గరం మసాలా పౌడర్: 1 టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీ స్పూన్లు
- మిరియాల పొడి (బ్లాక్ పెప్పర్ పౌడర్): 1/2 టీ స్పూన్
- పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు
- బియ్యప్పిండి: 1 టేబుల్ స్పూన్
- నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
- వెల్లుల్లి రెమ్మలు: 10 (సన్నగా కట్ చేసినవి)
- పచ్చిమిర్చి: 3
- కరివేపాకు: 2 రెమ్మలు
- కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి: 1 టీ స్పూన్
తయారీ విధానం:
మ్యారినేషన్: ముందుగా, 1/2 కిలో బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో ఉప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ (ఇది మంచి రంగును ఇస్తుంది), పసుపు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చూసుకోండి. గిన్నెకు మూత పెట్టి, కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి. మసాలాలు చికెన్ కు బాగా పడతాయి.
పిండి మిశ్రమం కలుపడం: ఒక గంట తర్వాత, మ్యారినేట్ అయిన చికెన్ లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలపండి. ఈ పిండి మిశ్రమం చికెన్ కు క్రిస్పీనెస్ ను ఇస్తుంది. లోపల సాఫ్ట్ గా, పైన క్రిస్పీగా మారడానికి సహాయపడుతుంది. మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీటిని చిలకరించి కలుపుకోవచ్చు.
డీప్ ఫ్రైయింగ్: ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి మీడియం హీట్ లో వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత, ఒక్కొక్క చికెన్ ముక్కను విడివిడిగా వేసి వేయించండి. అన్నీ ఒకేసారి వేయకుండా, కొన్ని కొన్ని బ్యాచ్ లుగా వేయడం వల్ల చికెన్ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వేగుతాయి. వేసిన వెంటనే కదపకుండా, రెండు నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించండి. మరీ ఎక్కువ సేపు వేయిస్తే గట్టిగా మారే అవకాశం ఉంది. వేగిన చికెన్ ముక్కలను తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
తాలింపు: అదే పాన్ లో నూనె మొత్తం తీసివేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె ఉంచుకోండి. ఈ నూనెలో సన్నగా కట్ చేసుకున్న పది వెల్లుల్లి రెమ్మలు వేసి రంగు మారే వరకు వేయించండి. తర్వాత, మూడు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించి, రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి.
తుది మిశ్రమం: తాలింపు వేగిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. ఫ్లేమ్ ను సిమ్ లో ఉంచి, చికెన్ ముక్కలను ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ చికెన్ ముక్కలకు బాగా పడుతుంది.
మిరియాల పొడి జోడింపు: ఒక నిమిషం తర్వాత, కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేసి, మళ్ళీ బాగా కలపండి. మిరియాల పొడిని చివరిలో కలపడం వల్ల దాని ఫ్లేవర్ మరింత అద్భుతంగా ఉంటుంది. సిమ్ లోనే ఉంచి మరొక నిమిషం పాటు కలుపుకుంటే, మిరియాల పొడి చికెన్ ముక్కలకు బాగా పడుతుంది.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ను వడ్డించండి. చాలా సింపుల్ గా, రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈ అద్భుతమైన వంటకాన్ని ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ 65 రెసిపీని మీరు కూడా ప్రయత్నించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
