
రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఆహార చరిత్రకారుల ప్రకారం.. చికెన్ 65 పుట్టినిల్లు మన పక్క రాష్ట్రమైన తమిళనాడు. 1965లో చెన్నైలోని ప్రసిద్ధ బుహారీ హోటల్ వ్యవస్థాపకుడు ఎ.ఎం.బుహారీ ఈ ప్రత్యేక వంటకాన్ని మొదటిసారిగా పరిచయం చేశారు. ఆ సంవత్సరం గుర్తుగా దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ హోటల్‌లోనే చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి మరికొన్ని వంటకాలు కూడా మెనూలోకి వచ్చాయి. కానీ 65 సాధించిన క్రేజ్ దేనికీ దక్కలేదు.
చికెన్ 65 కేవలం ఒక ఫ్రై మాత్రమే కాదు, దాని మ్యారినేషన్‌లోనే అసలైన రుచి ఉంటుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మొక్కజొన్న పిండి, ఎర్ర కారం, కరివేపాకులను వాడి చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తారు. చివరగా పచ్చిమిర్చి, కరివేపాకు పోపుతో దీనికి ఇచ్చే ఫినిషింగ్ ఆ అరోమాను అమాంతం పెంచేస్తుంది. ప్రస్తుతం చికెన్ 65 భారతీయ ఆహార సంస్కృతిలో ఒక భాగమైపోయింది. చికెనే కాకుండా, వెజిటేరియన్స్ కోసం పనీర్ 65, గోబీ 65, మష్రూమ్ 65 వంటి వెరైటీలు కూడా ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. హైదరాబాదీ స్టైల్, ఆంధ్రా స్టైల్ అంటూ ప్రాంతాన్ని బట్టి దీని రుచి మారుతున్నా.. ఆ పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.