వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

ఈ రోజుల్లో డైట్ చేసే ప్రతి ఒక్కరి ప్లేటులో పుట్టగొడుగులు కనిపిస్తున్నాయి. అద్భుతమైన రుచి, అంతకు మించిన పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ అందరికీ అమృతం కాకపోవచ్చు.. కొంతమందికి ఇది పెద్ద ప్రమాదకరమైన అలెర్జీలకు దారితీస్తుందని మీకు తెలుసా..? ఎవరు వీటిని అస్సలు ముట్టుకోకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Who Should Not Eat Mushrooms

Updated on: Jan 26, 2026 | 4:57 PM

ప్రస్తుతం పోషకాహార ప్రియుల జాబితాలో పుట్టగొడుగులు మొదటి వరుసలో ఉంటున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఈ ఆహారం రుచికరమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి వరప్రసాదం. అయితే అమృతం లాంటి ఈ ఆహారం అందరికీ సరిపడదని, కొంతమందిలో ఇది తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగులలో ఉండే కొన్ని ప్రత్యేక ప్రోటీన్లు బూజు అలెర్జీ కారకాలతో క్రాస్ రియాక్ట్ అవుతాయి. సున్నితమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు వీటిని తిన్నప్పుడు, శరీరం వాటిని హానికరమైనవిగా భావించి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు రావడం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎవరు దూరంగా ఉండాలి?

ఆయుర్వేద , ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను నివారించడం ఉత్తమం..

అలెర్జీ బాధితులు: ఇప్పటికే వేరే ఆహార పదార్థాలు లేదా పుప్పొడి అలెర్జీ ఉన్నవారికి పుట్టగొడుగుల వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ.

బలహీనమైన రోగనిరోధక శక్తి: డయాబెటిస్ లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో ఫంగల్ ప్రోటీన్లు ఇన్‌ఫెక్షన్లకు కారణం కావచ్చు.

జీర్ణ సమస్యలు: గ్యాస్, ఉబ్బరం, అజీర్ణంతో బాధపడేవారు పుట్టగొడుగులను ఎక్కువగా తింటే సమస్య మరింత ముదురుతుంది.

గర్భిణీలు – బాలింతలు: గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఆయుర్వేద నిపుణులు కిరణ్ గుప్తా సూచిస్తున్నారు.

ప్రయోజనాల గని.. కానీ అడవి పుట్టగొడుగులనే జాగ్రత్త

పుట్టగొడుగులలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. వీటిలో విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ డి, సెలీనియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మార్కెట్లో పండించే పుట్టగొడుగుల కంటే అడవిలో దొరికే పుట్టగొడుగులు ఎక్కువ అలెర్జీ కారకాలను కలిగి ఉంటాయి. కొన్ని అడవి పుట్టగొడుగులు అత్యంత విషపూరితమైనవి కూడా. కాబట్టి, కేవలం ధృవీకరించిన, సురక్షితమైన పుట్టగొడుగులను మాత్రమే ఎంచుకోవాలి.