
నార్త్, సౌత్ అనే తేడానే లేదు.. నాన్ వెజ్ ప్రియులు చేపలు (Fish) ఇష్టంగా తింటారు. ఆదివారంతోపాటు.. అన్ని రోజుల్లో కూడా చేపలను తింటారు.. చేపలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. కానీ కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు గుండెతోపాటు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే.. చాలా మంది సంప్రదాయ పద్దతుల్లో చేపలను వండుకుని తింటారు. ముఖ్యంగా చింతపండుతో చేసే చేపల పులుసు అంటేనే నోరూరించే వంటకం.. అందులోనూ బెండకాయలు చేర్చి చేసే ఈ ప్రత్యేకమైన చేపల పులుసు రుచి మరెక్కడా దొరకదు. సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే ఈ పులుసును ఎలా చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఈ వంటకానికి కొద్దిగా కారం, నూనె ఎక్కువగా ఉంటేనే రుచి పెరుగుతుంది. ముఖ్యంగా, వండిన వెంటనే కాకుండా మరుసటి రోజు తింటే దీని అసలైన రుచిని ఆస్వాదించవచ్చు.
చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నూనె: తగినంత (ఎక్కువగా వాడాలి), మెంతులు: 1/4 టీస్పూన్, కరివేపాకు, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, గసగసాలు, వెల్లుల్లి (మసాలా కోసం), టమాటాలు పేస్ట్ కోసం, పచ్చిమిరపకాయలు, బెండకాయలు 4-6 చాలు, చింతపండు రసం: తగినంత (రుచికి సరిపడా), కొత్తిమీర..
చేపల మ్యారినేషన్: ముందుగా 2 కిలోల చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసి, చేత్తో చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా కలిపిన చేప ముక్కలను అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ వల్ల ముక్కలకు ఉప్పు, కారం పట్టి రుచి పెరుగుతుంది.
పోపు తయారీ: గ్యాస్ ఆన్ చేసి బాండీ (వెడల్పు గిన్నె) పెట్టుకోవాలి. చేపల కూరకు నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి.. మర్చిపోకండి. కొద్దిగా నూనె వేసి, టీస్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
ఉల్లిపాయ పేస్ట్: ముందుగా ఐదు ఉల్లిపాయలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్‌ను నూనెలో వేసి గోధుమ రంగులోకి మారేవరకు బాగా వేయించాలి.
మసాలా తయారీ: ధనియాలు, జీలకర్ర, అల్లం, గసగసాలు, వెల్లుల్లిని మిక్సీలో కాకుండా రోట్లో దంచుకుంటే పులుసు రుచి అద్భుతంగా ఉంటుంది. దంచిన ఈ మసాలాను వేగిన ఉల్లిపాయ పేస్ట్‌తో కలిపి పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించాలి.
టమాటా పేస్ట్: టమాటాలను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న దానిని ఇప్పుడు వేయించుకున్న మసాలా మిశ్రమంలో కలపాలి. ఇవన్నీ నూనెలో బాగా వేగేంత వరకు ఉడికించాలి. అప్పుడే చేపల పులుసు రుచిగా ఉంటుంది. లేకపోతే పచ్చి వాసన వచ్చి రుచి ఉండదు. మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.
బెండకాయలు, పచ్చిమిరపకాయలు: నూనె పైకి తేలిన తర్వాత ఐదు నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసి రెండు నిమిషాలు వేయించాలి. బెండకాయలు వేయడం వల్ల పులుసు మరింత రుచిగా మారుతుంది.
చింతపండు రసం, చేప ముక్కలు కలపడం: ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి పులుపును బట్టి రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. వేగిన బెండకాయల మిశ్రమంలో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసి, చింతపండు రసాన్ని కలపాలి.
ఉడికించడం: గరిటెతో కలపకూడదు. చేప ముక్కలు విరిగిపోకుండా పాత్రను పట్టుకొని వీడియోలో చూపినట్లు నెమ్మదిగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చేర్చుకోవచ్చు. మూతపెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. మధ్యలో ఒకసారి ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసి, అవసరమైతే చేర్చుకోవచ్చు. నూనె పైకి తేలి, పులుసు చిక్కబడేంత వరకు ఉడికించాలి.
పులుసు సిద్ధమైన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. కొత్తిమీర అందుబాటులో ఉంటే వేసుకుంటే మరింత సువాసన వస్తుంది. ఇప్పుడు మూతపెట్టి, గ్యాస్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈ చేపల పులుసును వండిన రోజు కంటే మరుసటి రోజు అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..