Health Tips: ఇలాంటి అలవాట్లు ఉన్నాయా.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదంలో పడ్డట్లే.. మార్చుకోకుంటే ముప్పు తప్పదు..

Diabetes: సక్రమమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహ వ్యాధి అన్ని వయసుల వారిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో సహా గుండె జబ్బులతో పాటు..

Health Tips: ఇలాంటి అలవాట్లు ఉన్నాయా.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదంలో పడ్డట్లే.. మార్చుకోకుంటే ముప్పు తప్పదు..
Diabetes

Updated on: Sep 16, 2022 | 5:18 PM

మధుమేహం భారతదేశంలో అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటిగా మారింది. దాని రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేగంగా పెరగడానికి ప్రజల జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు, కొన్ని చెడు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 7.7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. టైప్ 1 మధుమేహం అనేది మీరు మీ కుటుంబం నుండి పొందగలిగే జన్యుపరమైనది. కానీ, టైప్ 2 డయాబెటిస్ తప్పుడు ఆహారం, ప్రజల జీవన అలవాట్ల వల్ల వస్తుందంట.

ఏదైనా వ్యాధిని నివారించడానికి, దాని కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ముందుగా డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే కారకాల గురించి తెలుసుకోవాలి. మీరు కూడా డయాబెటిస్‌కు దూరంగా ఉండాలనుకుంటే, కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం, భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

1. ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం..

విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు? ప్రతి ఒక్కరూ సోఫా లేదా బెడ్‌పై హాయిగా పడుకుని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే దీర్ఘకాలంలో ఈ సరదా ఒక శిక్షగా మారుతుంది. ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం గుండె, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపుతుంది. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. అధిక కేలరీల ఆహారం..

అధిక కేలరీలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత కేలరీలు వినియోగిస్తాడో అదే మొత్తంలో తీసుకోవాలి. ఒక వ్యక్తి ఎక్కువ శారీరక శ్రమ లేని పని చేస్తే, అతను తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి.

3. వ్యాయామం చేయకపోవడం..

వ్యాయామం చేయడం వల్ల శరీర శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే మీ కుటుంబంలో మధుమేహంతో బాధపడేవారు ఉంటే, వ్యాయామం చేయడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాంటి వారిలో మధుమేహం లక్షణాలు ఆలస్యంగా మొదలవ్వడమే కాకుండా రోగుల్లో షుగర్ లెవెల్ స్థాయిని మెయింటెన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు లేదా ఐదు రోజులు తప్పనిసరిగా వర్కవుట్‌లు చేయాలి.

4. మద్యపానం, ధూమపానం..

అధిక ధూమపానం, మద్యపానం నేరుగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహంతో ముడిపడి ఉంటుంది. ధూమపానం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. ధమనులను సంకోచిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

5. పోషకాహార లోపం..

అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాల లోపం అనేక వ్యాధులకు కారణమవుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు, శాకాహారి, మిత ఆహారంతో మధుమేహం రాకుండా నిరోధించవచ్చని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అలాగే, దీర్ఘకాలం పాటు విటమిన్ డి లోపం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి, ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

6. స్థూలకాయం..

శరీరంలోని కాలేయం, అంతర్గత అవయవాలలో పేరుకుపోయే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంబంధించినదని తేలింది. దీని వల్ల మనిషి బరువు పెరగడం మొదలవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో తక్కువ శరీర సూచిక ఉన్న వ్యక్తులు తక్కువ ప్రమాదం కలిగి ఉంటారు.

7. ఒత్తిడి..

ఒత్తిడి శరీరం, మెదడు రెండింటి పనితీరును భంగపరుస్తుంది. ఇది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం, మెడిటేషన్, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండాలి.