Rat-bitten Watermelon : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విషాహారం తిని ఇద్దరు చిన్నారులు చనిపోగా, మృతుల తల్లిదండ్రులు, నాన్నమ్మ.. ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వివరాల్లోకి వెళితే, అంతర్గాం మండలం ఇస్సంపేట గ్రామానికి చెందిన శ్రీశైలం, గుణవతి దంపతులతోపాటు, కుమారులు నందు(12), చరణ్(10), వాళ్ల నాన్నమ్మ, పుచ్చకాయలో సగం తిన్నారు. మిగతా భాగాన్ని అల్మారాలో ఉంచారు. రాత్రి మిగిలిన సగం పుచ్చకాయ తిన్నారు. అయితే, అర్థరాత్రివేళ వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందర్నీ వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ చిన్నారులు నందు, చరణ్ మృతి చెందారు. అటు, మృతుల తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అయితే, దీనిపై ఆరాతీయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మృతుల ఇంట్లో ఎలుకల్ని చంపేందుకు మందు తీసుకువచ్చారు. ఆ ఎలుకల మందుని కొంచెం కొంచెం అక్కడక్కడా చల్లి మిగిలిన ప్యాకెట్ ను అల్మారాలో పెట్టారు. అయితే, దాన్ని తిన్న ఎలుకలు అటు ఇటు తిరుగుతూ పుచ్చకాయ మీద కూడా తిరిగి దానిని కొంత తిన్నాయి. అది గుర్తించని కుటుంబసభ్యులు మిగిలిన సగం పుచ్చకాయని తినడంతో ఇంత ఉపద్రవం సంభవించింది. ఈ మేరకు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, చిన్నారులిద్దరూ మరణించిన విషయాన్ని ఇంకా తల్లిదండ్రులకు తెలియపరచలేదు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read also : ‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’