Sriramanavami Prasadam Chalimidi: శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం.. తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం..!

శ్రీరామనవమి పండుగలో పానకం, వడపప్పు ఎంత ముఖ్యమో, చలిమిడి కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా తెలుగువారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చలిమిడి ఉండాల్సిందే. పూజలు, పెళ్లి, వ్రతాలకు చలిమిడి తయారుచేస్తారు. చలిమిడి సంపూర్ణ జీవితం, సుఖసంతానం, శ్రేయస్సుని ఇస్తుందని నమ్ముతారు. వేసవి కాలంలో వచ్చే శ్రీరామనవమి పండుగలో శరీరానికి చలువ చేసే పదార్థాలను ప్రసాదంగా తీసుకోవడం మన సంప్రదాయం. కొన్ని స్మార్ట్ చిట్కాలతో 2026 శ్రీరామనవమికి పక్కా కొలతలతో చలిమిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

Sriramanavami Prasadam Chalimidi: శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం.. తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం..!
Srirama Navami Chalimidi

Updated on: Mar 25, 2026 | 6:30 PM

శ్రీరామనవమి పండుగ నైవేద్యాలలో చలిమిడికి విశిష్ట స్థానం ఉంది. చలిమిడిని ప్రధానంగా రెండు రకాలుగా తయారు చేస్తారు. వడపప్పుతో కలిపి తినే పచ్చి చలిమిడి, నిల్వ ఉండే పాక చలిమిడి. ఈ చలిమిడి తింటే శక్తి పెరుగుతుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. పోషకాలు కూడా అందుతాయి. అందుకే ఈ చలిమిడి ప్రసాదం అంటే చాలామంది ఇష్టపడతారు. వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి చలువ చేసే గుణం ఈ ప్రసాదానికి ఉంది. పండుగ రోజున పానకం, వడపప్పుతో పాటు ఈ చలిమిడిని సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. సరైన మోతాదులో పదార్థాలను కలిపితే చలిమిడి మెత్తగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తుంది. తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..

పచ్చి చలిమిడి తయారీకి కావలసినవి:

తడి బియ్యం పిండి (నానబెట్టి ఆడించిన బియ్యం పిండి) – 2 కప్పులు,

ఇవి కూడా చదవండి

తురిమిన బెల్లం – 1 కప్పు

యాలకుల పొడి – అర టీస్పూన్

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురుము – కొద్దిగా

తయారీ విధానం:

బియ్యం పిండి తయారీ: ముందుగా బియ్యాన్ని 4-5 గంటల పాటు నానబెట్టి, నీటిని వడకట్టి ఒక పొడి గుడ్డపై 10 నిమిషాలు ఆరనివ్వాలి. బియ్యం తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టి మెత్తని పిండిని జల్లించుకోవాలి. దీనినే తడి బియ్యం పిండి అంటారు.

బెల్లం కలపడం: ఒక వెడల్పాటి గిన్నెలో బెల్లం తురుము తీసుకుని, అందులో ఈ తడి బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. బెల్లంలోని తేమతోనే పిండి ముద్దగా మారుతుంది (అవసరమైతేనే ఒక చెంచా పాలు లేదా నీళ్లు కలపాలి).

సువాసన కోసం: ఇందులో యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి.

ముగింపు: చివరగా నేతిలో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు లేదా గసగసాలు చేరిస్తే చలిమిడి సిద్ధం. చలిమిడి మంచి రంగులో రావాలంటే ముదురు రంగు బెల్లాన్ని ఎంచుకోండి. చలిమిడి చేసేటప్పుడు అందులో కొద్దిగా పానకం నీటిని కలిపితే విభిన్నమైన రుచి వస్తుంది.

పచ్చి చలిమిడి 1-2 రోజులు మాత్రమే తాజాగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బెల్లం పాకం పట్టి పాక చలిమిడి చేసుకోవాలి. శ్రీరామనవమి రోజున ఈ చలిమిడిని వడపప్పుతో కలిపి నైవేద్యంగా సమర్పించి స్వామివారి కృపకు పాత్రులవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us