
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు కుంకుమపువ్వు. అంతేకాదు.. దాని ఖరీదుకు తగినట్టుగానే, ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ. కుంకుమపువ్వులో క్యాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు వాడకం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యానిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం అనర్థమే అవుతుంది అంటారు. అలాగే, కుంకుమపువ్వు కూడా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుంకుమపువ్వును ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయని చెబుతున్నారు. అలాగే, శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. కుంకుమపువ్వు అధికంగా తీసుకోవడం వల్ల బైపోలార్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు సైతం వెల్లడించాయి. అందుకే ఇలాంటి తీవ్రమైన సమస్యను నివారించడానికి మీరు కుంకుమపువ్వు తక్కువ మోతాదులోనే తినాలని సూచిస్తున్నారు.
కుంకుమపువ్వును ఎక్కువగా వాడటం వల్ల శరీరంలోని యాంటిజెన్లను ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒక్కొసారి కుంకుమపువ్వు అతిగా తీసుకోవటం వల్ల ముక్కు నుండి రక్తం వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కనురెప్పలు, పెదవులు మొద్దుబారిపోతాయని అంటున్నారు. అందుకే తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..