
కాలం ఏదైన ప్రతి ఇంట్లోనూ పెరుగు అనేది కామన్‌గా ఉంటుంది. భోజనంలో పెరుగు లేనిదే చాలామందికి ముద్ద దిగదు. చలవ చేస్తుందని, బరువు తగ్గొచ్చని, ఎముకలు గట్టిపడతాయని అందరూ పెరుగును అమితంగా ఇష్టపడతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం పెరుగును ఎలా పడితే అలా తింటే అమృతం కాస్తా విషంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ సవాలియా పెరుగు గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆయుర్వేద దృక్కోణంలో పెరుగు రుచిలో పుల్లగా ఉన్నప్పటికీ.. దాని స్వభావం వేడి చేస్తుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. బరువు పెరగాలనుకునే వారికి, బలాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇది మేలు చేస్తుంది. కానీ దీనిని తినేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలను పాటించాల్సిందే.
చాలామంది కొన్ని రకాల కూరలు లేదా వంటకాల్లో పెరుగు వేసి వేడి చేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. వేడి చేయడం వల్ల పెరుగులోని సహజ గుణాలు, శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా నశించిపోతాయి. ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
రాత్రి సమయంలో పెరుగు తినడం అస్సలు మంచిది కాదు. రాత్రి పూట మన శరీరంలో సహజంగానే కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో జీర్ణం కావడానికి భారంగా ఉండే పెరుగును తింటే అది కఫాన్ని మరింత పెంచుతుంది. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
పెరుగును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోకూడదు. రోజువారీగా తీసుకోవాలనుకుంటే పెరుగుకు బదులుగా.. బాగా చిలికిన మజ్జిగలో సైంధవ లవణం, నల్ల మిరియాలు, జీలకర్ర వంటి మసాలాలు కలుపుకుని క్రమం తప్పకుండా తాగవచ్చు.
ఈ రోజుల్లో పెరుగులో రకరకాల పండ్లను కలుపుకుని ఫ్రూట్ యోగర్ట్ లేదా ఫ్రూట్ సలాడ్స్ తినడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు-పండ్ల కలయిక విరుద్ధాహారం. ఇది శరీరంలోని సూక్ష్మ ఛానెళ్లను బ్లాక్ చేస్తుంది. దీనిని దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. చర్మ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
చికెన్, మటన్ లేదా ఫిష్ వంటి మాంసాహార వంటకాల్లో గ్రేవీ కోసం చాలామంది పెరుగును వాడుతుంటారు. అలాగే బిర్యానీతో పాటు పెరుగు రైతా తింటుంటారు. ఇది శరీరంలో విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. మాంసం, చేపల స్వభావానికి పెరుగు స్వభావం పూర్తిగా భిన్నమైనది కావడం వల్ల ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
“మీరు పెరుగును ఆస్వాదించాలనుకుంటే.. అప్పుడప్పుడు, అది కూడా మధ్యాహ్నం పూట మాత్రమే మితంగా తీసుకోండి” అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.