
Ragi Pittu Recipe: రాగులు క్యాల్షియం, ప్రోటీన్లకు నిలయం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు, మహిళలకు ఇది అత్యంత అవసరమైన ఆహారం. కీళ్ల నొప్పులను తగ్గించడానికి, శరీరంలో క్యాల్షియం శాతాన్ని పెంచడానికి రాగి పిట్టు ఎంతో మేలు చేస్తుంది. తరచుగా నడుము నొప్పితో బాధపడేవారు వారానికి రెండు మూడు సార్లు దీనిని తింటే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పుష్పవతి అయిన ఆడపిల్లలకు ఇది వెన్నెముకను దృఢపరుస్తుంది.
రాగి పిట్టును తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ముందుగా ఒక కప్పు రాగులను తీసుకుని మిక్సీలో బరకగా (రవ్వలా) పట్టాలి. ఆ పిండిని ఒక గిన్నెలో తీసుకుని కొన్ని నీళ్లు పోస్తూ ముద్ద కట్టేలా తడుపుకోవాలి. నీటి శాతం సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి పిండిని చేతితో పట్టుకుంటే లడ్డూలా రావాలి.
అనంతరం ఒక మట్టి పాత్రలో నీళ్లు పోసి, దానిపై కాటన్ క్లాత్ కట్టి, తడిపిన రాగి పిండిని స్ప్రెడ్ చేయాలి. ఆవిరి మీద సుమారు 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. పిండి రంగు మారితే అది పూర్తిగా ఉడికినట్లు అర్థం. ఆవిరి మీద ఉడికించడం వల్ల ఇందులోని పోషకాలు బయటకు పోకుండా శరీరానికి పూర్తిగా అందుతాయి.
ఉడికిన రాగి మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో పావు కప్పు బెల్లం తురుము, కొద్దిగా ఇలాచీ పొడి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పొడిని కలపాలి. రుచి కోసం కొద్దిగా నెయ్యి, చిటికెడు ఉప్పును చేరిస్తే అమృతంలా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం లేకుండా కేవలం ఉప్పుతో కూడా దీనిని తీసుకోవచ్చు.
మెటల్ బాడీ కంటే మట్టి పాత్రలో స్టీమ్ చేయడం వల్ల ఈ వంటకానికి సహజమైన రుచి వస్తుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవారికి, నీరసంగా ఉండేవారికి ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఎముకల పుష్టికి, నడుము నొప్పి నివారణకు ఈ పాతకాలపు వంటకాన్ని మీ వంటింట్లో భాగం చేసుకోండి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..