గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి

గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రుచి చాలా ప్రత్యేకం. ఆ రుచిని ఇంట్లోనే, అదీ కడుపుకి చల్లగా ఉండే విధంగా, ఎక్కువ సమయం పుల్లగా అవ్వకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా సులభమైన పద్ధతి. ప్రసాదం కోసమైనా, లంచ్ లోకైనా చేసుకోవచ్చు..

గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
Prasadam Style Daddojanam

Updated on: Aug 30, 2026 | 8:49 PM

గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రుచి చాలా ప్రత్యేకం. ఆ రుచిని ఇంట్లోనే, అదీ కడుపుకి చల్లగా ఉండే విధంగా, ఎక్కువ సమయం పుల్లగా అవ్వకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా సులభమైన పద్ధతి. ప్రసాదం కోసమైనా, లంచ్ లోకైనా చేసుకోవచ్చు.. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మీరు కావాలంటే గిన్నెలో కూడా అన్నాన్ని వండుకోవచ్చు. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికి ఉంటుంది. మనం వండిన అన్నంలో నుంచి రెండు కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. అంటే సుమారు పావు కిలో అన్నంలో సగం అన్నం అన్నమాట. అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్‌తో గానీ, శుభ్రమైన గ్లాస్‌తో గానీ మెత్తగా మెదిపాలి. ఇలా వేడి మీద మెదిపితే అన్నం చక్కగా నలుగుతుంది.

అన్నం బాగా మెదిపిన తర్వాత, అందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలపాలి. ఇలా పెరుగన్నంలో పాలు కలపడం వల్ల అది ఎక్కువ సమయం పుల్లగా అవ్వకుండా చాలా రుచిగా ఉంటుంది. పాలు కలుపుతూ ఉండగానే అన్నం కాస్త చల్లారుతుంది. ఒకవేళ అన్నం ఇంకా వేడిగా ఉంటే, ఐదు నిమిషాలు ఆగి, ఆ తర్వాత పెరుగును కలపాలి. ఇక్కడ పూర్తిగా చల్లారిన పాలను తీసుకున్నాము కాబట్టి అన్నం చల్లారిపోతుంది. ఇప్పుడు ఒకటిన్నర నుండి రెండు కప్పుల వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగన్నం వెంటనే తినేవారైతే ఒకటిన్నర కప్పు సరిపోతుంది. నైవేద్యం కోసం లేదా బాక్సుల్లో తీసుకువెళ్లేటట్లయితే రెండు కప్పుల కమ్మటి పెరుగును తీసుకోవడం మంచిది. కమ్మటి పెరుగును తీసుకోవడం వల్ల దద్దోజనం రుచిగా ఉండటమే కాకుండా ఎక్కువ సేపు పులవకుండా ఉంటుంది.

పెరుగు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర ఆకుని వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు దద్దోజనానికి ప్రత్యేక రుచినిచ్చే పోపును సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె తీసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒకటి, రెండు టేబుల్‌స్పూన్ల పల్లీలను తీసుకుని దోరగా వేయించాలి. పల్లీలను మిగతా పప్పులతో కలిపి వేస్తే సరిగా వేగవు కాబట్టి ముందుగా వేయించడం ముఖ్యం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత, ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత, రెండు టేబుల్‌స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రెండు మూడు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అర టీస్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, రెండు ఎండుమిరపకాయలను వేసి వేయించాలి. ఇవన్నీ దాదాపు వేగిన తర్వాత, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఈ విధంగా వేయించిన పోపును సిద్ధం చేసుకున్న పెరుగన్నంలోకి తీసుకుని బాగా కలపాలి. అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపితే, గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో దద్దోజనం సిద్ధం అయిపోతుంది. ఇలా మనం ప్రసాదం కోసమే కాదు, దద్దోజనం తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే చిటికెలో తయారు చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us