Breakfast Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిందా? రవ్వ, బంగాళదుంపలతో ఇలా ఉతప్పం చేయండి!

ఉరుకుల పరుగుల జీవితంలో రోజువారీగా ఇడ్లీ, దోశల కోసం పిండి రుబ్బే సమయం లేనప్పుడు తక్కువ సమయంలో చేసుకునే అల్పాహారాల వైపు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి పిండిని ముందుగా నానబెట్టే అవసరం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ, పెరుగు , బంగాళదుంపలతో కేవలం 15 నిమిషాల్లో నోరూరించేలా చేసుకునే అద్భుతమైన 'బంగాళదుంప ఉతప్పం' పూర్తి రెసిపీ , సులభమైన తయారీ విధానం తెలుసుకోండి.

Breakfast Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిందా? రవ్వ, బంగాళదుంపలతో ఇలా ఉతప్పం చేయండి!
Instant Aloo Uttapam Recipe

Edited By:

Updated on: Jul 04, 2026 | 4:40 PM

బంగాళదుంపలతో సాధారణంగా ఫ్రై లేదా కుర్మాలు చేస్తుంటారు. కానీ బొంబాయి రవ్వతో కలిపి తురిమిన పచ్చి బంగాళదుంప ముక్కలతో చేసే ఈ ఉతప్పం మిగతా అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల కంటే చాలా భిన్నమైన రుచిని అందిస్తుంది. తక్కువ నూనె లేదా నెయ్యితో చాలా త్వరగా తయారయ్యే ఈ వంటకాన్ని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దాని తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

తయారీకి కావలసిన ముఖ్యమైన పదార్థాలు

బంగాళాదుంపలు – 2 (పెద్దవి)

బొంబాయి రవ్వ (సెమోలినా) – 1 కప్పు

గట్టి పెరుగు – 1/2 కప్పు

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

పచ్చి మిరపకాయ – 1 (సన్నగా తరిగినది)

జీలకర్ర – అర టీస్పూన్

కారం పొడి – ఒక చిటికెడు

ఉప్పు – రుచికి తగినంత

నూనె లేదా నెయ్యి – కాల్చడానికి కొద్దిగా

కొత్తిమీర – కొద్దిగా

ఉతప్పం పిండి మిశ్రమాన్ని సిద్ధం చేసే పద్ధతి
ఈ ఆలూ ఉతప్పం పర్ఫెక్ట్‌గా కుదరాలంటే ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ , అర కప్పు పెరుగు వేసి స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి బంగాళాదుంపల తొక్క తీసి, వాటిని నీటిలో శుభ్రంగా కడిగి తురుము పీటతో సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన బంగాళదుంపను కూడా రవ్వ మిశ్రమానికి జోడించి, ఉతప్పం పిండి లాగా (దోశ పిండి కంటే కాస్త చిక్కగా) అవసరమైనంత నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంపై మూతపెట్టి రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడేలా 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే పక్కన నాననివ్వాలి.

పిండి 15 నిమిషాలు నానిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర, జీలకర్ర, ఒక చిటికెడు కారం , రుచికి సరిపడా ఉప్పు వేసి పిండిని మరొకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్-స్టిక్ దోశ పెనం లేదా బాణలి పెట్టి వేడి చేయాలి. పెనం బాగా కాగాక కొద్దిగా నూనె లేదా నెయ్యిని అంతా సమానంగా రాసి, దానిపై మనం సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని రెండు గరిటెలు పోసి మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉతప్పం లాగా రౌండ్‌గా పరచాలి. ఆ తర్వాత చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మంటను మధ్యస్థంగా (మీడియం ఫ్లేమ్) ఉంచి ఉడికించాలి. ఒక వైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపునకు తిప్పి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా ఉండే వేడివేడి బంగాళదుంప ఉతప్పం తినడానికి సిద్ధం. దీనిని కారంగా ఉండే అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.

Follow Us