
ఏమీ తినబుద్ధి కానప్పుడు, కూరగాయలు లేనప్పుడు లేదా కేవలం నోటికి మంచి రుచి కావాలనుకున్నప్పుడు మనకి గుర్తుకు వచ్చేది కారప్పొడి. ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో ఇది ఎప్పుడూ సిద్ధంగా ఉండే వంటకం. అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంత బాగుంటుందో, ఇడ్లీలోకి పక్కన పెట్టుకుంటే అంతే రుచికరంగా ఉంటుంది. ఈ కారప్పొడిని ఇంట్లోనే సులువుగా, మంచి రుచితో, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా తయారుచేసుకోవాలో ఈ రెసిపీలో వివరంగా తెలసుకుందాం. ఈ పొడిని నల్ల కారం లేదా పొడి కారం లేదా మాడ్చిన కారం అని కూడా పిలుస్తారు.
ఎండుమిర్చి: 100 గ్రాములు (గింజలు ఎక్కువగా ఉన్నవి మంచివి)
వెల్లుల్లి రెబ్బలు: ఒక పెద్ద వెల్లుల్లిపాయ వలిచినవి (ఇష్టం లేనివారు స్కిప్ చేయవచ్చు)
నూనె: 4 టీస్పూన్లు (రెండు భాగాలుగా)
పచ్చిశెనగపప్పు: 2-3 టేబుల్‌స్పూన్లు
ధనియాలు: ¼ కప్పు (4-5 టేబుల్‌స్పూన్లు)
జీలకర్ర: 1-1.5 టేబుల్‌స్పూన్లు
చింతపండు: చిన్న ఉసిరికాయ సైజు
కరివేపాకు: ఎక్కువ మొత్తంలో (రుచికి తగ్గట్టు)
కల్లు ఉప్పు: 2-2.5 టేబుల్‌స్పూన్లు (లేదా రుచికి సరిపడా)
1. ఎండుమిర్చి సిద్ధం చేయడం: ముందుగా ఎండుమిర్చిని తీసుకుని తొడిమెలు తీసి, మధ్యకు విరిచి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల గింజలు కూడా బాగా వేగి కారప్పొడికి మంచి రుచి వస్తుంది. గింజలు ఎక్కువగా ఉన్న మిరపకాయలు ఎంచుకోవడం మంచిది.
2. వెల్లుల్లి వేయించడం (ఆప్షనల్): స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, దానిలో వలిచిన వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చినవారు మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు.
3. ఎండుమిర్చి వేయించడం: అదే పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చిని వేయాలి. మంటను పూర్తిగా సిమ్‌లో ఉంచి, మాడిపోకుండా జాగ్రత్తగా, కలుపుతూ దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు బాగా వేగితేనే పొడి రుచిగా వస్తుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
4. పప్పులు, మసాలాలు వేయించడం: ఇప్పుడు అదే పాన్‌లో మరో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, పచ్చిశెనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి. అది కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగితేనే కారప్పొడికి మంచి రుచి వస్తుంది.
5. చింతపండు, కరివేపాకు వేయించడం: పప్పులు, మసాలాలు దోరగా వేగిన తర్వాత, చిన్న చిన్న ముక్కలుగా తుంచిన చింతపండును, ఎక్కువ మొత్తంలో కరివేపాకును వేయాలి. కరివేపాకు, చింతపండు పూర్తిగా క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకోవాలి. కరివేపాకు చేతితో తుంచితే తునిగిపోయేంత బాగా వేగాలి. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపి, అన్నింటినీ ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
6. కారప్పొడి గ్రైండ్ చేయడం:
పూర్తిగా చల్లారిన ఎండుమిర్చిని ముందుగా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీనికి 2 నుండి 2.5 టేబుల్‌స్పూన్ల కల్లు ఉప్పును (లేదా రుచికి సరిపడా) చేర్చాలి. రోటి పచ్చళ్ళు, పొడి కారాలకు కల్లు ఉప్పు వాడితే మంచి రుచి వస్తుంది.
మూత పెట్టి, మిక్సీని కంటిన్యూస్‌గా తిప్పకుండా, రెండు మూడు పల్స్‌లు ఇస్తూ గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండుమిర్చి లోపల గింజలు కూడా బాగా మెత్తబడతాయి.
ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న పప్పులు, మసాలాలు, చింతపండు, కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి వేయాలి. మళ్ళీ, కంటిన్యూస్‌గా తిప్పకుండా పల్స్‌లు ఇస్తూ ఆపుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి ముద్దపడకుండా పొడిపొడిగా వస్తుంది.
చివరగా, ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి, ఒక్కసారి పల్స్ చేసి ఆపాలి. ఎక్కువ తిప్పకూడదు.
ఈ విధంగా రుచికరమైన, సులువుగా తయారుచేసుకోగల నల్లకు కారం సిద్ధం. ఇది ఇడ్లీలోకి, వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలిపి తినడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు లేదా అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ కారప్పొడితో చక్కగా కడుపు నిండా తినవచ్చు. ఈ రెసిపీని ప్రయత్నించి, మీకు ఎలా కుదిరిందో తెలియజేయండి.