
ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లల కోసం వారి ఆరోగ్యం కోసం తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్వీట్ చేసి పెడుతారు. ఆ స్వీట్స్ లలో కచ్చితంగా మినప సున్నుండలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్స్. ఈ స్వీట్స్ పిల్లల ఎదుగుదలకు మంచివి. మినుముల్లో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, కాల్షియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కెర వెంటనే శక్తిని అందిస్తుంది.
కొంతమంది పిల్లలు నానబెట్టిన బాదం తినరు. దాంతో బాదం పొడి కలిపి సున్నుండలు చేస్తారు. ఈ కొత్త పద్ధతితో చేసిన మినప సున్నుండలు చాలా రుచికరంగా ఉంటాయి. మినుములు ఎలాంటివి అయినా వాడొచ్చు. వేయించిన మినుములే ఎక్కువ రుచిగా ఉంటాయి. జీడిపప్పు, బాదం కలిపితే రంగు కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా నెయ్యిని పక్కన పెట్టుకుని మిగతా అన్ని పదార్థాలను (మినుములు, జీడిపప్పు, బాదం, చక్కెర) విడివిడిగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడులన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా ఈ పొడి మిశ్రమంలో పోస్తూ.. చేతితో చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మినప సున్నుండలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే.. అవి నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ స్వీట్ ను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.