ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇదొక్కటి వేస్తే గిన్నె లేపాల్సిందే..

చేపల్లో అత్యంత ఆరోగ్యకరమైన ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు చేపలు మూలం.. అంతేకాకుండా.. విటమిన్లు D, B2, ఖనిజాలు అయోడిన్, జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.. అందుకే.. ఎన్నో సమస్యల నివారణకు సహాయపడే చేపలు తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇదొక్కటి వేస్తే గిన్నె లేపాల్సిందే..
Fish Curry

Updated on: Apr 11, 2026 | 10:19 AM

చేపల్లో అత్యంత ఆరోగ్యకరమైన ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు చేపలు మూలం.. అంతేకాకుండా.. విటమిన్లు D, B2, ఖనిజాలు అయోడిన్, జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.. అందుకే.. ఎన్నో సమస్యల నివారణకు సహాయపడే చేపలు తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అయితే.. చేపలతో మస్తు మస్తు రెసిపీలను తయారు చేసుకుని.. ఇష్టంగా తింటారు. ఫ్రై, పులుసు.. ఇలా ఎన్నో రకాలుగా వండుకుంటారు.. అయితే.. వీటన్నింటిలో పులుసు టెస్ట్ ఎప్పుడూ బెస్టే.. ఆంధ్రా స్టైల్ లో రుచికరమైన చేపల పులుసు చేస్తే.. గిన్నె కూడా వదలకుండా లాగించేస్తారు.. అయితే.. అలాంటి చేపల పులుసును.. ఇంట్లోనే సులభంగా తయారుచేయాలనుకుంటున్నారా? ఈ రెసిపీ మీ కోసమే.. చేపల కూరను పర్ఫెక్ట్‌గా చేయడానికి పులుపు, ఉప్పు, కారం సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.

అత్యంత రుచికరమైన చేపల పులుసును ఎలా తయారుచేయాలో తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు:

* తాజా చేపలు: 1 కేజీ

* ఉప్పు: రుచికి సరిపడా (మ్యారినేషన్‌కు అర టీస్పూన్, వంటకు కల్లుప్పు)

* పసుపు: పావు టీస్పూన్ (మ్యారినేషన్‌కు), పావు టీస్పూన్ (వంటకు)

* కారం: 1 టేబుల్ స్పూన్ (మ్యారినేషన్‌కు), 2 టేబుల్ స్పూన్లు (వంటకు, స్పైసీగా కావాలంటే ఎక్కువ)

* చింతపండు: 50 గ్రాములు (పెద్ద నిమ్మకాయ సైజ్)

* నూనె: 4-5 టేబుల్ స్పూన్లు

* ఉల్లిపాయలు: 2 మీడియం సైజ్ (సన్నగా తరిగినవి)

* పచ్చిమిర్చి: 4-5 (కట్ చేసినవి)

* కరివేపాకు: కొద్దిగా

* టమాటాలు: 3 (కట్ చేసి లేదా గ్రైండ్ చేసినవి)

* కొత్తిమీర: చివరగా గార్నిష్ చేయడానికి

మసాలా తయారీకి:

* ధనియాలు: 1 టేబుల్ స్పూన్

* జీలకర్ర: 1 టీస్పూన్

* మెంతులు: పావు టీస్పూన్

* వెల్లుల్లిపాయలు: 12-15

* గసగసాలు: 1 టేబుల్ స్పూన్ (అరగంట ముందు నానబెట్టినవి)

తయారీ విధానం:

చేపల శుభ్రత, మ్యారినేషన్: ముందుగా 1 కేజీ తాజా చేపలను ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేయాలి. నీళ్ళన్నీ వంపి, వాటికి అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పట్టించి 20-30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇది చేప ముక్కలు చప్పగా లేకుండా రుచిని అందిస్తుంది.

చింతపండు పులుసు తయారీ: 50 గ్రాముల చింతపండును శుభ్రంగా కడిగి, నీళ్ళలో నానబెట్టాలి. బాగా నానిన తర్వాత, చింతరసాన్ని వేరు చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

మసాలా ముద్ద తయారీ: మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత దీనికి వెల్లుల్లిపాయలు, నానబెట్టిన గసగసాలను నీటితో సహా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మసాలా ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో మూడు కట్ చేసిన టమాటాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను సన్నగా తరిగి కూడా ఉపయోగించవచ్చు.

వంట ఇలా చేసుకోండి..

చేపల పులుసు కోసం వెడల్పుగా ఉండే పాన్‌ను ఎంచుకోండి, ఇది చేప ముక్కలు విడిపోకుండా ఉడకడానికి సహాయపడుతుంది. పాన్‌లో నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా వేయించాలి.

టమాటా, మసాలా వేయించడం: ఉల్లిపాయలు వేగిన తర్వాత, గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని వేసి, నూనె పైకి తేలే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి. టమాటా బాగా వేగిన తర్వాత, సిద్ధం చేసుకున్న మసాలా ముద్దను వేసి నూనె విడిచేంత వరకు బాగా వేయించాలి. ప్రతి పదార్థాన్ని సరిగ్గా వేయించడం కూరకు అద్భుతమైన రుచిని ఇస్తుంది.

కారం, ఉప్పు, పులుసు కలపడం: మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత, పావు టీస్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం (మీరు స్పైసీగా కావాలంటే పెంచుకోవచ్చు), రుచికి సరిపడా కల్లుప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చింత పులుసును, గ్రేవీకి సరిపడా నీళ్లను కలపాలి. పులుసు మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌లో ఉండేలా చూసుకోండి.

చేప ముక్కలు వేసి ఉడికించడం: గ్రేవీ రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత, మ్యారినేట్ చేసిన చేప ముక్కలను నెమ్మదిగా, విడివిడిగా వేయాలి. చేప ముక్కలు వేసిన తర్వాత, గరిటెతో కదపకుండా, పాన్‌ను పట్టుకుని నెమ్మదిగా తిప్పుతూ కలపాలి. ఇది చేప ముక్కలు విడిపోకుండా, పులుసు వాటికి బాగా పట్టేలా చేస్తుంది.

చివరి దశ: మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ సమయంలో ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసి అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి, మళ్ళీ పాన్‌ను తిప్పుతూ కలపాలి. చేప ముక్కలు తెల్లగా కాకుండా, ఉప్పు, కారం పట్టి ఎరుపు రంగులోకి మారినప్పుడు కూర సిద్ధమైనట్లు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను వేసి, పాన్‌ను నెమ్మదిగా తిప్పి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఈ చేపల పులుసును వెంటనే కాకుండా, అరగంట నుండి గంట తర్వాత సర్వ్ చేస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెసిపీని మీరు కూడా ప్రయత్నించి, ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us