Khara Pongal Recipe: ఈ సంక్రాంతికి వెరైటీగా కేరళ స్టైల్ పొంగల్! కొబ్బరి ముక్కల రుచితో నిమిషాల్లో రెడీ!

సంక్రాంతి అంటేనే పంటల పండుగ.. కొత్త బియ్యం, పప్పులతో చేసే పొంగలి ఆ పండుగకు అసలైన రుచిని తెస్తుంది. ఎప్పుడూ చేసే తీపి పొంగలి, కట్టె పొంగలి కాకుండా ఈసారి కేరళ స్టైల్‌లో 'ఖారా పొంగల్' ట్రై చేయండి. కొబ్బరి ముక్కలు, నెయ్యి, మిరియాల ఘాటుతో నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం అటు ఆరోగ్యానికి, ఇటు రుచికి పెట్టింది పేరు. శబరిమల మకరవిళక్కు వేళ కేరళ ఇళ్లలో ఘుమఘుమలాడే ఈ పొంగల్ తయారీ విధానం మీకోసం.

Khara Pongal Recipe: ఈ సంక్రాంతికి వెరైటీగా కేరళ స్టైల్ పొంగల్! కొబ్బరి ముక్కల రుచితో నిమిషాల్లో రెడీ!
Kerala Style Khara Pongal Recipe

Updated on: Jan 14, 2026 | 6:44 PM

కేరళ వంటకాలంటేనే కొబ్బరి, సుగంధ ద్రవ్యాల మేళవింపు. మరి అదే స్టైల్‌లో సంక్రాంతి పొంగల్ చేస్తే ఎలా ఉంటుంది? అల్లం, వెల్లుల్లి, మిరియాల ఘాటుతో పాటు పంటికి తగిలే కొబ్బరి ముక్కలు ఈ ఖారా పొంగల్‌కు అద్భుతమైన రుచినిస్తాయి. అల్పాహారంగా తీసుకుంటే రోజంతా శక్తినిచ్చే ఈ పోషకాల గనిని ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఎలా సిద్ధం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు:

ముఖ్యమైనవి: బియ్యం (1 కప్పు), పెసరపప్పు (1/2 కప్పు).

తిరగమాత కోసం: నెయ్యి (2 స్పూన్లు), నూనె (2 స్పూన్లు), జీలకర్ర, మిరియాల పొడి (తలా ఒక స్పూన్).

ఫ్లేవర్ కోసం: అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు.

స్పెషల్ టచ్: సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు (1/4 కప్పు), వేయించిన జీడిపప్పు.

తయారీ విధానం:

బియ్యం, పప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయండి. ఒకటికి మూడు వంతుల నీరు పోసి, తగినంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి.

పాన్‌లో నూనె, నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర, మిరియాల పొడి, జీడిపప్పు వేయించండి.

అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించండి. చివరగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించాలి.

ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడికించిన పొంగలిలో వేసి బాగా కలపండి. పైన కొద్దిగా నెయ్యి, కొత్తిమీర చల్లుకుంటే కేరళ స్టైల్ పొంగల్ సిద్ధం!

చిట్కా:
ఈ పొంగల్‌ను కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే మిరియాలు, అల్లం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.