
మండుటెండలో చల్లటి పెరుగుతో భోజనం ముగించడం భారతీయులకు ఒక సంప్రదాయం. కానీ మధుమేహం అనే మాయదారి రోగం మన దేశంలో ఒక నిశబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్న వేళ, మనం తినే ప్రతి ముద్దపై అనుమానం కలగడం సహజం. ముఖ్యంగా పెరుగు విషయంలో.. దీనివల్ల షుగర్ పెరుగుతుందా?, మజ్జిగ తాగొచ్చా?, మార్కెట్లో దొరికే పెరుగు మంచిదేనా?” వంటి ప్రశ్నలు ప్రతి మధుమేహ రోగి మదిలో మెదులుతుంటాయి. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.
నిపుణుల పరిశోధనల ప్రకారం.. సహజసిద్ధమైన పెరుగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అద్భుతమైన ఆహారం. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. కడుపులో మంటను తగ్గించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మన శరీరంలో జీర్ణక్రియ ఎంత మెరుగ్గా ఉంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ అంత బాగుంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పెరుగు యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెంచదు. నెమ్మదిగా శక్తిని విడుదల చేయడం వల్ల డయాబెటిస్ రోగులకు ఇది సురక్షితం.
మనం సూపర్ మార్కెట్లలో చూసే అందమైన కప్పుల్లో లభించే స్ట్రాబెర్రీ, మ్యాంగో లేదా వెనిలా ఫ్లేవర్డ్ యోగర్ట్‌లు మధుమేహ రోగులకు నిజమైన శత్రువులు. ఈ పెరుగులో ఆ పండు తక్కువ, చక్కెర, రసాయనాలు ఎక్కువ ఉంటాయి. ఇవి చూడటానికి ఆరోగ్యకరంగా అనిపించినా, ఒక్క కప్పు తింటేనే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఎప్పుడూ ఇంట్లో తోడుపెట్టిన స్వచ్ఛమైన ఆవు పాలు లేదా వెన్న తీసిన గేదె పాల పెరుగునే వాడాలి.
మధుమేహం ఉన్నవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అధిక బరువు. బరువు పెరిగే కొద్దీ షుగర్ లెవెల్స్ పెరగడం గ్యారెంటీ. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల మాటిమాటికీ చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. బరువును అదుపులో ఉంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
చాలా మంది పెరుగులో పంచదార లేదా బూందీ వేసుకుని తింటారు. ఇది మధుమేహ రోగులకు ఏమాత్రం మంచిది కాదు.
మిరియాలు, జీలకర్ర: పెరుగులో చిటికెడు మిరియాల పొడి లేదా వేయించిన జీలకర్ర పొడి కలుపుకోవడం వల్ల రుచితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది.
కూరగాయల రాయితా: పెరుగులో ఉల్లిపాయలు, కీర దోసకాయ లేదా టమోటా ముక్కలు కలిపి రైతా లాగా తీసుకోవడం వల్ల ఫైబర్ అదనంగా అందుతుంది. ఇది షుగర్ నియంత్రణకు మరింత మేలు చేస్తుంది.
సరైన సమయం: రాత్రి పూట కంటే మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవడం శ్రేయస్కరం.
మీకు పెరుగు తినడం భారంగా అనిపిస్తే, దానిని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. మజ్జిగ మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా మజ్జిగ రక్షణ కవచంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నంత మాత్రాన మీకు ఇష్టమైన పెరుగును వదులుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పంచదార లేని, ఇంట్లో తయారుచేసిన తాజా పెరుగును సరైన పరిమాణంలో తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి వరమవుతుంది.
(గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న ఆహార నియమాలు వివిధ అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)