వార్నీ.. ఇడ్లీ వెనక ఇంత కథ ఉందా.. సముద్రాలు దాటి మన ప్లేట్‌లోకి ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Idly History: దక్షిణ భారతీయుల ఉదయం.. వేడివేడి ఇడ్లీ లేనిదే మొదలవ్వదు. సాంబార్, చట్నీలతో ముంచుకుని తినే ఈ అల్పాహారం మన సంస్కృతిలో ఒక భాగం. అయితే మనందరికీ ఇష్టమైన ఈ ఇడ్లీ అసలు భారతీయ వంటకం కాదని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా.. చరిత్రకారులు చెబుతున్న వాస్తవాలు అలాగే ఉన్నాయి. ఇడ్లీ ఎక్కడ పుట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వార్నీ.. ఇడ్లీ వెనక ఇంత కథ ఉందా.. సముద్రాలు దాటి మన ప్లేట్‌లోకి ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
The Surprising History Behind Idly

Updated on: Jan 24, 2026 | 1:22 PM

తెల్లగా మెరిసిపోయే ఇడ్లీ.. సాంబార్, చట్నీతో కలిపి తింటే ఆ మజాయే వేరు. దక్షిణ భారతీయులందరికీ ఇడ్లీ అంటే ఒక ఎమోషన్. తెలుగులో రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ వంటకం దేశంలోనే పుట్టిందని మనమంతా నమ్ముతాం. కానీ చరిత్రకారులు చెబుతున్న వాస్తవాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మనం ప్రాణప్రదంగా భావించే ఇడ్లీ జన్మస్థలం భారతదేశం కాదట. కొన్ని చారిత్రక అధ్యయనాల ప్రకారం.. ఇడ్లీకి 7వ, 12వ శతాబ్దాల మధ్య ఇండోనేషియాలో మూలాలు ఉన్నాయి. అక్కడ దీనిని కెడ్లి లేదా కేదారి అని పిలిచేవారు. ఆ కాలంలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారి వంటవారు ఈ వంటకాన్ని మన దేశానికి పరిచయం చేశారని ఒక బలమైన వాదన ఉంది.

అరబ్బులకూ సంబంధం ఉందా?

మరో ఆసక్తికరమైన కథనం ప్రకారం.. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీలో ఇడ్లీకి అరబ్బులతో సంబంధం ఉన్నట్లు ఉంది. భారతదేశంలో స్థిరపడిన అరబ్ వ్యాపారులు బియ్యం, కొబ్బరి చట్నీతో చేసిన బంతి ఆకారపు వంటకాన్ని తినేవారట. దాని రూపాంతరమే నేటి ఇడ్లీ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

ప్రాచీన గ్రంథాల్లో ఇడ్లీ ప్రస్తావన

అయితే ఇడ్లీ మూలం గురించి భిన్న వాదనలు ఉన్నప్పటికీ, ప్రాచీన భారతీయ సాహిత్యంలో దీనికి విశేష స్థానం ఉంది. 7వ శతాబ్దపు కన్నడ ఇతిహాసం వడ్డారాధనేలో ఇడ్లీ తయారీ విధానం గురించి వివరించారు. పెరియ పురాణం వంటి తమిళ ఇతిహాసాల్లో కూడా ఇడ్లీ ప్రస్తావనలు కనిపిస్తాయి. 10వ శతాబ్దంలో సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి వలస వచ్చినప్పుడు వారి ద్వారా కూడా ఈ వంటకం విస్తరించిందని నమ్ముతారు.

భారతీయ పులియబెట్టే విద్య

ఇడ్లీ తొలి రూపం సముద్రం దాటి వచ్చి ఉండవచ్చు. కానీ బియ్యం, మినప్పప్పును కలిపి పులియబెట్టి, ఆవిరి మీద ఉడికించే ఆధునిక పద్ధతి మాత్రం భారతదేశంలోనే అభివృద్ధి చెందింది. పూర్వకాలపు ఇడ్లీలు నేటి ఇడ్లీల్లా మృదువుగా ఉండేవో లేదో తెలియదు కానీ మనం చేసే ఈ మార్పులే దానిని ప్రపంచంలోనే అత్యుత్తమ అల్పాహారంగా మార్చాయి. పుట్టింది ఎక్కడైనా పెరిగింది మాత్రం దక్షిణ భారతదేశంలోనే. అందుకే ఇడ్లీ ఎప్పటికీ మన గర్వకారణమే. ఇడ్లీ చరిత్ర ఏదైనా, మన ప్లేట్లోకి వేడివేడి సాంబార్‌తో వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని ఏ చరిత్ర మార్చలేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..