
ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారి డైట్ లిస్ట్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయంలో చాలా మందికి డౌట్లు ఉంటాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే కాదని, దీనివల్ల కొన్ని వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానిని ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. యాపిల్స్ పులియబెట్టే ప్రక్రియలో ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలకారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషన్ పరిశోధకురాలు కరోల్ జాన్స్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు వెనిగర్ తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా అదుపులో ఉంటాయి. 2017లో జరిగిన మరో మెటా-ఎనాలసిస్ సైతం ఆహారం తర్వాత రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్పందనలను తగ్గించడంలో వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించింది.
యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే కొవ్వు కరిగిపోతుందని, బెల్లీ ఫ్యాట్ మాయమవుతుందని ప్రచారాలు ఉన్నప్పటికీ, అది వాస్తవం కాదు. 2009లో జపనీస్ పరిశోధకుడు టోమూ కొండో నేతృత్వంలో 175 మందిపై జరిగిన 12 వారాల అధ్యయనంలో.. ప్రతిరోజూ వెనిగర్ తీసుకున్న వారిలో శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వులో స్వల్ప మార్పులు కనిపించాయి. అంటే సరైన ఆహార నియమాలతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నియంత్రణకు కొంతవరకు మద్దతు ఇస్తుందే తప్ప, అద్భుతాలు ఏమీ చేయదని అర్థం చేసుకోవాలి.
సోషల్ మీడియాలో చెప్పుకునేలా యాపిల్ సైడర్ వెనిగర్ గట్ హెల్త్‌ను పూర్తిగా బాగు చేస్తుందా అంటే ఇంకా పూర్తి ఆధారాలు లేవు. జంతువులపై చేసిన ప్రాథమిక ప్రయోగాల్లో ఇది గట్ బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుందని తేలినప్పటికీ, మానవులపై పరిశోధనలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. కాబట్టి ఇది గట్ మైక్రోబయోమ్‌ను రిపేర్ చేస్తుందని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.
సరైన సమయం: రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణే మీ లక్ష్యమైతే, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే భోజనం చేయడానికి కొద్దిసేపటి ముందు లేదా భోజనంతో పాటు తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. సాధారణంగా డైట్‌లో భాగం చేసుకోవాలనుకుంటే దీనికి ప్రత్యేక సమయమంటూ ఏమీ లేదు.
సరైన మోతాదు: ప్రారంభంలో ఒక పెద్ద గ్లాసు నీటిలో కేవలం 1 టీస్పూన్ వెనిగర్ కలిపి తీసుకోవడం ఉత్తమం. ఎక్కువ వెనిగర్ తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనుకోవడం పొరపాటు.
యాపిల్ సైడర్ వెనిగర్ తీవ్రమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. నీళ్లలో కలపకుండా నేరుగా తాగితే అది గొంతులో మంటను కలిగించడమే కాకుండా పళ్లపై ఉండే రక్షణ పొరను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడూ కాన్సంట్రేటెడ్ షాట్ రూపంలో తీసుకోకూడదు. తగినంత నీటిలో కలిపి తాగడం లేదా సలాడ్ డ్రెస్సింగ్‌లు, వంటకాల్లో భాగంగా ఉపయోగించడం అత్యంత సురక్షితమైన పద్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు. తాగిన తర్వాత సాధారణ నీటితో నోటిని శుభ్రంగా పుక్కిలించి ఉమ్మివేయడం మంచిది.