
భారతీయ వంట గదిలో నూనె లేనిదే పొయ్యి వెలగదు. కూరల నుంచి వేపుళ్ల వరకు నూనెదే ప్రధాన పాత్ర. అయితే ఇదే నూనె నేడు అనేక గుండె జబ్బులకు మూలకారణంగా మారుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం తీసుకునే నూనె పరిమాణం, దాని నాణ్యతపై అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు. చాలామంది నూనెను ఇష్టానుసారంగా వాడుతుంటారు. అసలు మనం ఎంత నూనె వాడాలి? ఏది వాడాలి? అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు కేవలం 3 నుండి 4 టీస్పూన్లు నూనె మాత్రమే తీసుకోవాలి. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం నెలకు గరిష్టంగా 2 లీటర్ల నూనెను మాత్రమే వాడటం ఉత్తమం. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు నెలకు 750 మి.లీ మించి నూనెను వాడకూడదు.
భారతీయ వంట పద్ధతులకు ఏ నూనె సరిపోతుందనే విషయంలో నిపుణులు స్పష్టతనిచ్చారు
ఆవాల నూనె: భారతీయ వంటలకు ఇది చాలా అనువైనది. దీని స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అధిక వేడి వద్ద కూడా నూనెలోని పోషకాలు దెబ్బతినవు.
పొద్దుతిరుగుడు నూనె: ఇది కూడా గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.
వేరుశనగ నూనె: ఇది కూడా మధ్యస్థ ఉష్ణోగ్రత వంటలకు మంచి ఎంపిక.
టివి ప్రకటనలు చూసి మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ వాస్తవానికి రసాయనాల మయం. నూనెను శుద్ధి చేసే క్రమంలో అధిక ఉష్ణోగ్రత వద్ద రసాయనాలను కలుపుతారు. దీనివల్ల నూనెలోని సహజ పోషకాలు నశించి, విషతుల్యమైన అంశాలు చేరతాయి. ఈ నూనెలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి, ధమనులలో అడ్డంకులను సృష్టిస్తాయి. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఒకే రకమైన నూనెను కాకుండా ప్రతి నెలా లేదా రెండు నెలలకోసారి నూనె రకాన్ని మార్చడం వల్ల అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించడం వల్ల అది ట్రాన్స్ ఫ్యాట్‌గా మారుతుంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బులకు ప్రధాన కారకం. వీలైనంత వరకు శుద్ధి చేయని గానుగ పట్టిన నూనెలను వాడటానికి ప్రాధాన్యత ఇవ్వండి. రుచి కంటే ఆరోగ్యం మిన్న. నూనె వాడకాన్ని తగ్గించి, సరైన నాణ్యమైన నూనెను ఎంచుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని 50శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..