
ఆరోగ్యకరమైన ఆహారంపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో, మల్టీగ్రెయిన్ అంబలి ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఆయుర్వేద నిపుణులు చెప్పే ఈ ప్రత్యేక రెసిపీ, శరీరాన్ని బలపరిచి, పోషకాల లోపాలను దూరం చేసే శక్తినిస్తుంది. ఈ అంబలి తయారీకి రాగులు, జొన్నలు, ఫూల్ మఖానా, బాదం పప్పు వంటి నాలుగు ప్రధాన పదార్థాలను వినియోగిస్తారు. వీటితో పాటు అవసరాన్ని బట్టి ఇతర మిల్లెట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సోయా లేదా గోధుమలను కూడా చేర్చుకోవచ్చు. వీటిన్నింటిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.. అంతేకాకుండా.. ఎండాకాలం బాడీ కూల్ గా ఉండటంతోపాటు.. పలు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు..
ముందుగా, 200 గ్రాముల రాగులను శుభ్రం చేసి, రెండు రోజులు ఎండబెట్టి, తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయిలో రాగులను రెండు నుండి మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల రాగుల్లోని దుమ్ము తొలగిపోయి, తేమ లేకుండా పొడి నిల్వ ఉంటుంది. తర్వాత, ఒక కప్పు జొన్నలను మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించాలి. జొన్నలు శరీరానికి శక్తినిచ్చి నీరసాన్ని తగ్గిస్తాయి. అనంతరం, ఒక కప్పు ఫూల్ మఖానాను లో ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు వేయించాలి. ఫూల్ మఖానాలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. చివరిగా, పావు కప్పు బాదం పప్పులను కొద్దిగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. బాదం పప్పులు బలానికి, జుట్టు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా లేదా మీకు నచ్చినట్లుగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు నుండి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
అంబలి తయారు చేయడానికి, ఒక గిన్నెలో 500 మి.లీ. (రెండు కప్పులు) నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. మరో గిన్నెలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల మల్టీగ్రెయిన్ పొడిని తీసుకుని, అందులో ఒక కప్పు నీటిని కలిపి ఉండలు లేకుండా బాగా కలపాలి. నీళ్లు కొంచెం వేడయ్యాక, ఈ కలిపిన పిండి మిశ్రమాన్ని వేడి నీటిలో పోసి, నిరంతరం కలుపుతూ ఉడికించాలి. పిండి అడుగు అంటకుండా, మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. సుమారు నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అంబలి చిక్కబడి, చక్కగా ఉడికినట్లు అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అంబలిని పక్కన ఉంచి చల్లారనివ్వాలి.
తర్వాత, అంబలిని తీసుకోవడానికి సరిపడా పెరుగును తీసుకుని, ఉండలు లేకుండా బాగా కలపాలి. పెరుగు ఇష్టపడని వారు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. కలిపిన పెరుగులో ఒక కప్పు నీటిని కలిపి మజ్జిగలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత, చల్లారిన అంబలిని ఈ మజ్జిగలో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంబలి చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా తయారైన అంబలిని మట్టి గిన్నెలో తీసుకుంటే పులియకుండా తాజాగా ఉంటుంది. పెద్దవారైతే సర్వ్ చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి జోడించి తీసుకోవచ్చు. ఈ సూపర్ హెల్తీ అంబలి బలహీనంగా ఉన్నవారికి, పోషకాల లోపం ఉన్నవారికి ఉక్కులా బలాన్ని చేకూరుస్తుంది. అయితే.. ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తీసుకోవడం చాలా మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..