
రాగులు కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న అద్భుతమైన సూపర్‌ఫుడ్.. అందుకే.. వీటికి సంబంధించిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రాగులతో చేసుకునే ఆహారంలో రాగి ఇడ్లీలు ఒకటి.. రాగి ఇడ్లీలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సరైన కొలతలు, విధానం పాటిస్తే దూదిలా మెత్తని, స్పాంజీ రాగి ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన అల్పాహారం లేదా భోజనంగానూ ఉపయోగపడతాయి.
నానబెట్టడం: ముందుగా ఒక గిన్నెలో 1 1/2 కప్పుల రాగులు, 1/2 కప్పు బ్రౌన్ రైస్ (లేదా ఇడ్లీ బియ్యం) తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. బ్రౌన్ రైస్ లేకపోతే ఇడ్లీ బియ్యం లేదా రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు.
మరో గిన్నెలో 3/4 కప్పు మినపగుళ్లు, 1/2 టీస్పూన్ మెంతులు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టాలి.
పిండి రుబ్బడానికి అరగంట ముందు, ఇంకో గిన్నెలోకి 1/2 కప్పు అటుకుల్ని తీసుకొని కడిగి, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టాలి.
ముందుగా నానబెట్టిన మినప్పప్పు, మెంతులను మిక్సీ జార్‌లోకి తీసుకొని, నానబెట్టిన అటుకులను కూడా చేర్చాలి. కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్తగా, సాఫ్ట్‌గా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
ఇదే మిక్సీ జార్‌లోకి నానబెట్టిన రాగులు, బ్రౌన్ రైస్‌ను కూడా తీసుకొని, కొద్దిగా నీళ్లు పోసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఈ విధంగా బరకగా రుబ్బడం వల్ల ఇడ్లీలు మరింత సాఫ్ట్‌గా వస్తాయి. దోసె పిండి కోసం అయితే అన్నింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవచ్చు.
రుబ్బిన రాగి, బియ్యం పిండిని మినప పిండి ఉన్న గిన్నెలోకి తీసుకొని, చేతితో బాగా కలపాలి. పిండి కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదు, పులిసిన తర్వాత అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.
పిండిని కనీసం ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి. ఓవర్‌నైట్ పులియబెట్టడం ఉత్తమం. పిండి చక్కగా పులిసిన తర్వాత దాని పరిమాణం పెరుగుతుంది. పిండి బాగా పులిస్తేనే ఇడ్లీలు మెత్తగా, స్పాంజీగా వస్తాయి.
పులిసిన పిండిని ఒకసారి బాగా కలిపి, మీకు కావలసినంత పిండిని మరో గిన్నెలోకి తీసుకోండి.
ఇందులో రుచికి సరిపడా ఉప్పు చేర్చి, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు కలుపుకొని బాగా కలపాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు.
ఇడ్లీ ప్లేట్లను తీసుకొని, వాటికి నూనె లేదా నెయ్యి బాగా రాసుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇడ్లీ గడులలో నింపాలి.
ఇడ్లీ కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, పిండి నింపిన ఇడ్లీ ప్లేట్లను కుక్కర్‌లో ఉంచి, పది నుండి పన్నెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
పన్నెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపి, ఇడ్లీ కుక్కర్ నుండి ప్లేట్లను బయటకు తీయాలి. వెంటనే కాకుండా, ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత స్పూన్ లేదా కత్తితో ఇడ్లీలను ప్లేట్ల నుండి తీస్తే అవి చక్కగా వస్తాయి.
ఆ తర్వాత.. వేడివేడి రాగి ఇడ్లీలను కమ్మటి ఉల్లిపాయ చట్నీతో లేదా స్పెషల్ కారప్పొడితో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రాగి ఇడ్లీలు మంచి కలర్‌ఫుల్‌గా, సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉంటాయి. ఈ పద్ధతిని పాటించి మీరు కూడా రుచికరమైన రాగి ఇడ్లీలను తయారు చేసి, వాటి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..