
డయాబెటిస్ అనగానే చాలామందికి గుర్తొచ్చే మొదటి ఆలోచన.. ఇక పండ్లు తినడం మానేయాలి. ఇది మన సమాజంలో డయాబెటిస్ బాధితులకు ఇచ్చే అత్యంత సాధారణ సలహా. కానీ ఇది ఎంతవరకు నిజం? పండ్లలో ఉండే సహజ చక్కెరలు నిజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయా? ముఖ్యంగా అందరికీ ఇష్టమైన ద్రాక్ష, అరటిపండ్లు విషయంలో డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది తెలుసుకోవడం అందరికీ ఆసక్తి.
ద్రాక్ష పండ్లు చూడటానికి చిన్నగా, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటి విషయంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం. ద్రాక్షలో పీచు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇవి తిన్న వెంటనే అందులోని చక్కెర నేరుగా రక్తంలోకి చేరుతుంది. ద్రాక్షను మనం ఒక్కొక్కటిగా లెక్కపెట్టి తినడం కష్టం. తెలియకుండానే ఒక గుత్తిని ముగించేస్తాం. దీనివల్ల శరీరంలోకి ఒక్కసారిగా ఎక్కువ గ్లూకోజ్ చేరుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నీటి శాతం శరీరానికి మంచిదే, కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి.
అరటిపండు ప్రభావం అది ఎంతవరకు పండింది అనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటిలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కాకుండానే పేగుల ద్వారా వెళుతుంది కాబట్టి రక్తంలో చక్కెరను వెంటనే పెంచదు. పైగా ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండుపై నల్లటి మచ్చలు వచ్చాయంటే.. అందులోని స్టార్చ్ అంతా సింపుల్ షుగర్‌గా మారిపోయిందని అర్థం. ఇది తిన్న నిమిషాల్లోనే షుగర్ లెవల్స్ పెంచుతుంది. ఒక మధ్యస్థ అరటిపండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను కొంతవరకు నెమ్మదింపజేస్తుంది.
ఏ ఆహార పదార్థం రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో తెలిపే కొలతనే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. ద్రాక్ష, బాగా పండిన అరటిపండ్లు మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి వీటిని నేరుగా తినడం కంటే, ఇతర తక్కువ GI ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవడం డయాబెటిస్ రోగులకు సురక్షితం.
మీరు డయాబెటిస్ ఉన్నప్పటికీ ఈ పండ్లను ఆస్వాదించాలనుకుంటే ఈ నియమాలు పాటించండి.
ప్రోటీన్ లేదా ఫ్యాట్‌తో జత చేయండి: పండు తిన్నప్పుడు దానితో పాటు కొన్ని బాదం పప్పులు, వాల్‌నట్స్ లేదా గ్రీక్ పెరుగు తీసుకోండి. ఇందులోని ప్రోటీన్ చక్కెర విడుదలను ఆలస్యం చేస్తుంది.
సమయం ముఖ్యం: ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు పండ్లు తినకండి. వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం స్నాక్ లాగా తీసుకోవడం ఉత్తమం.
జ్యూస్ వద్దు – హోల్ ఫ్రూట్ ముద్దు: పండ్లను జ్యూస్ చేస్తే అందులోని ఫైబర్ పోతుంది. దీనివల్ల గ్లైసీమిక్ లోడ్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ పండును ముక్కలుగానే తినాలి.
పండ్లు తిన్న తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాల పాటు సాధారణ వాక్ చేస్తే, రక్తంలోకి విడుదలైన చక్కెరను కండరాలు శక్తిగా మార్చేస్తాయి. దీనివల్ల గ్లూకోజ్ స్పైక్ అయ్యే అవకాశం తగ్గుతుంది. కాగా ద్రాక్ష, అరటి అనేవి విరోధులు కావు.. అవి మన శరీరానికి శక్తినిచ్చే స్నేహితులు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వాటిని ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనే స్పృహతో ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.