Gongura Chicken: ఆదివారం స్పెషల్ నోరూరించే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్.. రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో ఇలా చేయండి!

ఆదివారం భోజనానికి ఏదైనా ప్రత్యేకంగా, మసాలాలు నిండిన ఘాటైన వంటకం వండాలని అనుకుంటున్నారా? అయితే రెస్టారెంట్ రుచిని తలపించే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోంగూరలోని పులుపు, చికెన్ ముక్కల కారం కలిసి భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ వంటకాన్ని హోటళ్లకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఎంతో రుచికరంగా వండుకోవచ్చు.

Gongura Chicken: ఆదివారం స్పెషల్ నోరూరించే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్.. రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో ఇలా చేయండి!
Andhra Style Gongura Chicken Recipe

Updated on: Jun 22, 2026 | 9:03 PM

ఆంధ్ర వంటకాలు.. ఘాటైన కారం, అద్భుతమైన సువాసన , ఘాటైన మసాలాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఆంధ్ర రెస్టారెంట్లలో లభించే గోంగూర చికెన్ వంటకానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ వంటకాన్ని ఇంట్లోనే మనమూ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని కోసం పెద్దగా హైరానా పడనక్కర్లేదు. నోటికి ఎంతో రుచిని ఇచ్చే ఈ స్పైసీ వంటకానికి కావలసిన పదార్థాలు , అది తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం.

గోంగూర చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు

చికెన్ – అర కేజీ

గోంగూర ఆకులు – 2 కప్పులు (తరిగినవి)

పెద్ద ఉల్లిపాయలు – 2, టమోటా – 1, పచ్చిమిరపకాయలు – 4 (తరిగినవి)

వెల్లుల్లి – 10 రెబ్బలు, అల్లం – 1 అంగుళం (సన్నగా తరిగినవి)

పసుపు పొడి – అర టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్

ఎండు మిరపకాయలు – 4, సోంపు – 1 టీస్పూన్, మెంతులు – పావు టీస్పూన్

నువ్వుల నూనె , ఉప్పు – రుచికి తగినంత

మసాలా పొడి తయారీ విధానం
మొదటగా పొయ్యి మీద ఒక పాన్ వేడి చేసి అందులో మెంతులు, ఎండు మిరపకాయలు , సోంపు గింజలు వేయాలి. వీటిని మధ్యస్థ మంట మీద మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఆ పిమ్మట వాటిని ఒక మిక్సర్ జార్‌లో వేసి మెత్తటి మసాలా పొడిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

చికెన్ , గోంగూర ఉడికించే పద్ధతి
ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి తగినంత నువ్వుల నూనె పోయాలి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు , పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించి, పసుపు పొడి , గరం మసాలా వేసి కలపాలి. అనంతరం తగినన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

మరొక పొయ్యి మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో మిగిలిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, తరిగిన గోంగూర ఆకులు, తగినంత ఉప్పు , ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఈ ఆకుకూర మిశ్రమాన్ని మెత్తబడే వరకు 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత, దానిని కుక్కర్‌లో సిద్ధంగా ఉన్న చికెన్ కూరలో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఈ మిశ్రమాన్ని తిరిగి స్టవ్‌పై పెట్టి మరో 2 నిమిషాల పాటు బాగా ఉడికిస్తే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ సిద్ధమవుతుంది.

Follow Us