మితం దేనికైనా హితం.. అతి ఎప్పుడైనా అనర్థమే అంటారు పెద్దలు.. నిజమే, ఏదైనా సమయానుకూలంగా.. అవసరం మేరకు చేస్తే దాని ప్రయోజనాలు ఆస్వాదించగలం. బెస్ట్ ఉదాహరణ యాపిల్ పండు. అదేంటి యాపిల్ పండు ఉదాహరణ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఒక యాపిల్ పండు తింటే ఇక వైద్యుడు అవసరం లేని ఆరోగ్యం మీ సొంతం అవుతుందనేది నానుడి. దానిలో ఉండే పోషకాలు.. ఔషధాలు అంత మంచి చేస్తాయి మానవ శరీరానికి. అదే యాపిల్ అతిగా తింటే.. రోజుకు డజన్ల లెక్కన తీనేస్తూ ఉంటే రోగాలు చుట్టుముడతాయి. ఇది నిపుణులు చెబుతున్న వాస్తవం. మరి రోజుకు ఎన్ని యాపిల్ పండ్లు తినాలి? అసలు ఎక్కువగా యాపిల్ తినడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అందుకు గల కారణాలను ఓసారి తెలుసుకుందాం..
ఒక మనిషి సగటున రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్ పండ్లు తీసుకోవడం ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి యాపిల్ పండులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదే ఫైబర్ పరిమితికి మించి శరీరానికి అందితే మలబద్దకం సమస్య ఏర్పడవచ్చు. సాధారణంగా మనుషులకు ఒక రోజుకు 20 నుంచి 40 గ్రాముల ఫైబర్ అవసరం. వయస్సును బట్టి అది 70 గ్రాములకు కూడా చేరవచ్చు. దీని కోసం యాపిల్ పండ్లు మాత్రమే తీసుకుంటే 15 యాపిల్స్ కావాలి. అయితే ఇతర ఆహార పదార్థాలు రోజూ తీసుకుంటారు కాబట్టి రోజుకు ఒకటి, రెండు యాపిల్ పండ్లతో ఆ ఫైబర్ శరీరానికి వచ్చేస్తుంది. అంతకు మించితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి, మలబద్ధకానికి దారితీస్తుంది.
యాపిల్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సెయిరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తి అయ్యి శరీరానికి శక్తినిస్తుంది. అయితే యాపిల్ పండ్లు అధికంగా తిన్నప్పుడు ఆ కార్పొహైడ్రేట్స్ అధిక సంఖ్యలో విడుదలయ్యి.. షుగర్ ను విపరీతంగా పెంచేస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.
పెస్టిసైడ్స్ తో జాగ్రత్త.. వాస్తవానికి యాపిల్ పంటలో కృత్రిమ ఎరువులు అధికంగా వాడతారు. ఒక వేళ మీరు ఎక్కువ యాపిల్ తీసుకుంటుంటే.. అత్యధిక పెస్టిసైడ్స్ మీ శరీరంలోకి పంపుతున్నట్లే లెక్క.
బరువు పెరుగుతారు.. యాపిల్ పండులో అధిక సంఖ్యలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి ఇన్ స్టంట్ శక్తినిస్తాయి. అయితే ఇది శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. కొవ్వు కూడా పెరుగుతుంది.
పళ్లు కూడా దెబ్బ తింటాయి.. అవును మీరు ఎక్కువగా యాపిల్స్ తింటే దానిలో ఉండే ఎసిడిక్ కంటెంట్ పళ్లపై ప్రభావం చూపుతుంది. రోజుకు ఒకటి రెండు తింటే ఇబ్బంది లేదు కాని.. అతిగా తింటే తప్పక ప్రభావం చూపుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారు అసలు తినొద్దు.. సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారు యాపిల్ పండ్లు తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ కంటెంట్ అధికంగా ఉండే పండుతో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి