అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..

రాగి దోశలు రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పోషకాహారం కూడా. సరైన పద్ధతిలో పులియబెట్టిన పిండితో తయారు చేసిన క్రిస్పీ రాగి దోశలు రోజంతా శక్తినిచ్చి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతాయి. ఈ సులభమైన రెసిపీతో ఇంట్లోనే ఆరోగ్యకరమైన రాగి దోశలను తయారు చేసి కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.

అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..
Crispy Ragi Dosa Recipe

Updated on: Jul 26, 2026 | 6:43 PM

రాగి దోశలు కేవలం రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పోషకాల గని కూడా.. రాగుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిస్పీ రాగి దోశలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. రాగులలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉండటం వలన ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని డైటీషియన్లు చెబుతున్నారు.. ముఖ్యంగా, అల్పాహారానికి ఈ దోశలు ఉత్తమ ఎంపిక..

తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • రాగులు: ఒక కప్పు
  • మినపగుళ్లు (లేదా మినప్పప్పు): పావు కప్పు
  • అటుకులు: పావు కప్పు
  • మెంతులు: ఒక టీ స్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: దోశలు కాల్చడానికి సరిపడా

తయారీ విధానం:

నానబెట్టడం: ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు రాగులు, పావు కప్పు మినపగుళ్లు (లేదా మినప్పప్పు), పావు కప్పు అటుకులు, ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోండి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టాలి. అటుకులు వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి.

రుబ్బడం: ఐదు గంటల తర్వాత నానబెట్టిన పదార్థాలలోని నీటిని వడగట్టి, వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పదార్థాలను మిక్సర్ జార్‌లోకి కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. అవసరమైతే, పక్కన పెట్టిన నీటిని ఉపయోగించి పిండిని కాస్త రవ్వ రవ్వగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి.

పులియబెట్టడం: ఇలా రుబ్బుకున్న పిండిని మూత పెట్టి రాత్రి అంతా ఒక పక్కన పెట్టండి. పిండి కనీసం పది నుండి పన్నెండు గంటల పాటు పులియబెట్టాలి. పిండి బాగా పులిస్తేనే దోశలు క్రిస్పీగా, రుచికరంగా వస్తాయి.

దోశ పిండి సిద్ధం చేయడం: ఉదయం చూస్తే పిండి చక్కగా పులిసి ఉంటుంది. దోశలు వేయడానికి కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు. దోశల కోసం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే, తగినంత నీళ్లు కలిపి దోశ పిండి కన్సిస్టెన్సీకి తీసుకురండి. పిండి మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ పిండితోనే కావాలంటే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు.

దోశలు కాల్చడం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, ఒక టీ స్పూన్ నూనె వేసి టిష్యూ పేపర్‌తో లేదా ఉల్లిపాయతో పాన్ అంతా బాగా స్ప్రెడ్ చేయండి. పాన్ బాగా వేడయ్యాక కొన్ని నీళ్లు చల్లి, మంటను తగ్గించండి. ఒక గరిటెడు రాగి దోశ పిండిని వేసి గుండ్రంగా తిప్పుతూ దోశలా వేయండి. దోశ పైన పిండి ఆరిపోయాక కొద్దిగా నూనె వేసి కాల్చండి. దోశలను ఎల్లప్పుడూ తక్కువ మంటపైనే కాల్చాలి. హై లేదా మీడియం ఫ్లేమ్‌లో కాల్చితే దోశలు క్రిస్పీగా రావు. ఒక వైపు రెండు మూడు నిమిషాలు బాగా కాల్చాక, మరో వైపుకు తిప్పి మరో నిమిషం కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇదే విధంగా కావలసినన్ని దోశలు చేసుకోవచ్చు. రెండు మూడు దోశలు తింటే చాలు, శరీరానికి మంచి శక్తి అందుతుంది, మధ్యాహ్న భోజనం వరకు ఆకలి కూడా వేయదు. ఈ క్రిస్పీ రాగి దోశలను కొబ్బరి పల్లి చట్నీతో కలిపి తింటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పద్ధతిలో ఇంట్లో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి దోశలు ఉత్తమమైనవి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us