
అటుకుల కట్లెట్ తయారు చేయడం చాలా సులభం. అటుకుల్లో ఉండే పోషకాలు, బంగాళాదుంపల సాఫ్ట్‌నెస్ మసాలాల ఘాటు కలిసి దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్నాక్ రెసిపీని బ్రెడ్ పొడిలో ముంచి వేయించడం వల్ల పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అటుకుల కట్లెట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
అటుకులు- 1 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు – 2
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/2 టీస్పూన్
మసాలాలు: జీలకర్ర, కారం, గరం మసాలా (తలా 1/2 టీస్పూన్)
పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు (సన్నగా తరిగినవి)
కోటింగ్ కోసం: మైదా పిండి (1/4 కప్పు), బ్రెడ్ పొడి (అవసరమైనంత)
నూనె – వేయించడానికి సరిపడా, ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం:
అటుకుల ప్రిపరేషన్: మొదట అటుకులను ఒకసారి నీటిలో కడిగి, నీటిని పూర్తిగా తీసివేసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత వాటిని చేతులతో మెత్తగా చేయాలి.
ఒక గిన్నెలో మెత్తగా చేసిన అటుకులు, ఉడికించిన బంగాళాదుంపల ముద్దను వేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని నచ్చిన ఆకారంలో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి.
మైదా పిండిని కొద్దిగా నీటితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ప్రతి కట్లెట్‌ను మొదట మైదా మిశ్రమంలో, ఆపై బ్రెడ్ పొడిలో దొర్లించాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. మీడియం మంట మీద ఈ కట్లెట్లను బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా వేయించి తీయాలి.