చేపల్లో కొవ్వు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువ. వారంలో రెండుసార్లయినా చేపలు తింటే.. మనం ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అంతా కల్తీ అయిపోయింది. మరి అలాంటప్పుడు సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసే చేపలు తాజావా.? కాదా.? అనేది తెలుసుకోవడం ఎలా.! డోంట్ వర్రీ.. ఈ చిట్కాలు ఫాలో అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. తాజాగా లేని(పాడైపోయిన) చేపలు తినడం ఆరోగ్యానికి హానికరం. అందుకే ఈ పద్దతుల ద్వారా వాటిని కనిపెట్టండి.
చేపలు తాజాగా ఉన్నాయో.! లేదో.! తెలుసుకునేందుకు వాటిని వాసన చూడటం ముఖ్యం. ఇది కొంచెం మీకు విచిత్రంగా అనిపించినా.. నిపుణులు మాత్రమే ఇదే ఉత్తమమైన మార్గమని అంటున్నారు. చేపలను వాసన చూసినప్పుడు.. మీకు దానిలో నుంచి సముద్రపు నీరు వాసన వచ్చినట్లయితే అవి తాజా చేపలని అర్ధం. అలా కాకుండా దుర్వాసన వచ్చినట్లయితే.. అవి ఖచ్చితంగా పాడైపోయిన చేపలు.
చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా.. అలాంటి చేపలు పాడైపోయినవి అని అర్ధం. తాజా చేపలకు ఎప్పుడూ కూడా కళ్లు ప్రకాశవంతంగా, అలాగే ఉబ్బినట్లుగా ఉంటాయి.
చేపల ఆకృతి…
చేపలను కొనుగోలు చేసేటప్పుడు.. తప్పనిసరిగా వాటి ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తాజా చేపల ఆకృతి లోపల, బయట ఒకేలా గట్టిగా ఉంటుంది. తాజా చేపల మాంసం శుభ్రంగా కనిపిస్తుంది. ఇక పాడైపోయిన చేపల చర్మంపై క్రస్ట్ ఉంటుంది. అలాగే అవి ప్రాణంలేనివి.
చేపలను ఎన్నుకునేటప్పుడు చూడాల్సిన విషయాలు..
సీఫుడ్ లేదా చేపలను ఎన్నుకునేటప్పుడు, మొదటిగా వాటి రంగును చూడాలి. చేపల రంగు ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. అలాగే వాటి కళ్లలో తెల్లటి పూతలు లేకుండా ఉండాలి.
మొప్పలను గమనించండి..
చేప తాజాగా ఉందని నిర్ధారించుకోవడానికి, మొప్పలను ఎత్తి, చేపల లోపలి భాగాంలో గులాబీ రంగులో ఉందో లేదో చూడండి. నిజానికి, తాజా చేపల ఆకృతి కొద్దిగా తడిగా ఉంటుంది.