
వర్కౌట్స్ ఎంత చేసినా డైట్ సరిగ్గా లేకపోతే ఫలితం ఉండదు. అయితే, డైట్ అంటే ఆకలితో అలమటించడం కాదు, సరైన పోషకాలను సరైన పద్ధతిలో తీసుకోవడం. కండరాల బలం నుంచి జీర్ణక్రియ వరకు, మన భోజనంలో ఉండాల్సిన ఆ 6 కీలక పదార్థాలు ఏంటో.. వాటి వల్ల కలిగే తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిట్‌నెస్ అనేది కేవలం ఒక రోజు చేసే పని కాదు, అది ఒక జీవనశైలి. చెన్నైకి చెందిన ‘క్వాడ్ ఫిట్‌నెస్’ సహ వ్యవస్థాపకుడు రాజ్ గణపతి తన 18 ఏళ్ల అనుభవాన్ని రంగరించి, ప్రతి భోజనంలోనూ ఉండాల్సిన ఆరు అంశాలను ఇన్స్‌టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆయన ప్రకారం, భోజనం సంతృప్తిని ఇవ్వడంతో పాటు పోషణను కూడా అందించాలి.
రాజ్ గణపతి సూచించిన 6 కీలక అంశాలు:
ప్రోటీన్: ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండటం చాలా ముఖ్యం. ఇది దీర్ఘకాలంలో కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది. మాంసం లేదా ఇతర ప్రోటీన్ వనరులు భోజనానికి మంచి రుచిని, టెక్స్చర్‌ను ఇస్తాయని ఆయన అంటారు.
కూరగాయలు : వీటిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కూరగాయల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
స్టార్చ్: శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు లేకపోతే భోజనం పూర్తి కానట్లే అని రాజ్ అభిప్రాయం. పరుగు, వెయిట్ లిఫ్టింగ్ వంటి పనులు చేయడానికి కావలసిన శక్తిని ఇవి అందిస్తాయి. ఇవి భోజనానికి ఒక రకమైన ‘కంఫర్ట్’ ఇస్తాయి.
కరకరలాడే పదార్థం: ప్లేట్‌లో ఏదైనా ఒకటి కరకరలాడేలా ఉంటే భోజనం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మానసిక సంతృప్తిని ఇస్తుంది.
పానీయం: భోజనం మధ్యలో లేదా తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేదా ప్రోటీన్ షేక్ వంటి ద్రవ పదార్థం అవసరం. ఇది మనం తినే రకరకాల పదార్థాల రుచులను స్పష్టంగా అనుభవించడానికి సహాయపడుతుంది.
చిన్న తీపి పదార్థం : భోజనం ముగింపులో కొంచెం తీపి ఉండటం రాజ్‌కు ఇష్టం. ఆయన డార్క్ చాక్లెట్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. మితంగా తీసుకున్నంత కాలం ఇది తప్పు కాదని ఆయన చెబుతున్నారు.
గమనిక : ఈ సమాచారం కేవలం సామాన్య అవగాహన కోసం మాత్రమే అందించబడింది. దీనిని వైద్య సలహాగా భావించకూడదు. మీ ఆరోగ్య పరిస్థితి, అలర్జీలు మరియు శారీరక శ్రమను బట్టి మీ డైట్ ప్లాన్ ఉండాలి. ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.