
సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే యాలకులు (Elaichi) కేవలం వంటకాలకు రుచి, వాసన ఇవ్వడానికే కాదు.. మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకులలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. వీటిని పోషకాల ఖజానాగా పేర్కొంటారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి కీలకమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. రాత్రి పడుకునే ముందు యాలుకలు నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రాత్రివేళ ఒకటి రెండు యాలక్కాయలను నమిలి తినడం వల్ల శరీరంలో జరిగే 6 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: యాలకులు జీర్ణ ఎంజైమ్లను సమర్థవంతంగా విడుదల చేస్తాయి. దీనివల్ల మీరు నిద్రపోతున్న సమయంలో కూడా తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది.
నోటి దుర్వాసనకు చెక్: ఉదయాన్నే లేవగానే నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి యాలకులు అద్భుతంగా తోడ్పడతాయి. యాలుకలలో ఉండే ‘సినోల్’ (Cineole) అనే సహజ నూనెలు నోట్లోని హానికర బ్యాక్టీరియాను నిరోధించి నోటిని రోజంతా ఫ్రెష్‌గా ఉంచుతాయి.
గాఢమైన నిద్ర – మానసిక ప్రశాంతత : యాలుకలకు మనసును ప్రశాంతపరిచే గుణం ఉంది. రాత్రిపూట దీనిని తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా గాఢ నిద్ర పడుతుంది.
శరీర శుద్ధి: ఇవి సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాలను (Toxins) మూత్రం ద్వారా బయటకు పంపి కాలేయం (Liver) పనితీరును మెరుగుపరుస్తాయి.
శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఆయుర్వేదంలో యాలుకలు ఒక ఉత్తమమైన ఔషధం. ఇవి శ్వాసనాళాల్లోని శ్లేష్మాన్ని తొలగించి శ్వాస సులభంగా ఆడేలా చేస్తాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నివారణ: యాలుకలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.
అందుకే.. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తినడం అలవాటు చేసుకుని, ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. ఏమైనా సందేహాలున్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..