ఇంట్లో స్విచ్ బోర్డులు కొత్తవాటిలా మెరిసిపోవాలా? ఇలా ట్రై చేసి చూడండి
స్విచ్ బోర్డుల శుభ్రత విషయంలో మీరు తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. వంటగదిలోని జిడ్డు మరకలు, పదేపదే తాకడం వల్ల ఏర్పడే మురికి స్విచ్ బోర్డుల మెరుపును తగ్గించి, గదిని పాతబడినట్లుగా చూపిస్తాయి. వాటిని తిరిగి కొత్తవాటిలా మార్చడానికి ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అవసరం లేదు, మన వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే నిమిషాల్లో మెరిపించవచ్చు.

ఇంట్లో ప్రతి రోజూ మనం పదేపదే ఉపయోగించే వస్తువులలో స్విచ్ బోర్డులు మొదటి వరుసలో ఉంటాయి. కిచెన్, బాత్రూమ్, బెడ్ రూమ్ ఇలా ప్రతి గదిలోనూ ఇవి ఉంటాయి. అయితే, చాలామంది వీటిని శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. ముఖ్యంగా తెల్లగా ఉండే స్విచ్ బోర్డులు త్వరగా మురికిని ఆకర్షిస్తాయి. వంటగదిలోని స్విచ్ బోర్డులైతే నూనె, మసాలాలు, పొగ వల్ల జిడ్డుగా మారి, కాలక్రమేణా నల్లగా లేదా పసుపు రంగులోకి మారిపోతాయి. కేవలం బట్టతో తుడిస్తే ఈ జిడ్డు పూర్తిగా పోదు. అయితే, కొన్ని సులువైన ఇంటి చిట్కాలతో వీటిని కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు.
స్విచ్ బోర్డులను శుభ్రం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా ఇంటి ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చేతులతో స్విచ్ బోర్డులను తాకవద్దు. అలాగే నీటిని నేరుగా స్విచ్ బోర్డులపై పోయకూడదు. ఉపయోగించే గుడ్డ లేదా బ్రష్ కేవలం తేమగా మాత్రమే ఉండాలి.
జిడ్డును తొలగించే ఇంటి చిట్కాలు..
- కిచెన్‌లోని మొండి జిడ్డు మరకలను తొలగించడానికి ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత టూత్ బ్రష్‌తో స్విచ్ బోర్డుపై సున్నితంగా రుద్ది, కొన్ని నిమిషాల తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. నిమ్మరసం పసుపు మరకలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
- ఒక చెంచా వెనిగర్‌లో కొద్దిగా నీరు కలిపి వస్త్రంతో తుడవడం వల్ల కూడా జిడ్డు మరకలు సులభంగా వదిలిపోతాయి.
- సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్ మరకలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పాత టూత్ బ్రష్‌పై కొద్దిగా పేస్ట్ తీసుకుని శుభ్రం చేస్తే, మూలల్లో ఉన్న మురికి కూడా సులభంగా తొలగిపోతుంది.
స్విచ్ బోర్డులను శుభ్రపరిచేటప్పుడు గరుకైన లోహపు వస్తువులను లేదా హార్ష్ కెమికల్స్‌ను ఉపయోగించవద్దు, ఇవి బోర్డులను పాడు చేస్తాయి. అలాగే గీతలు పడకుండా ఉండేందుకు మైక్రోఫైబర్ క్లాత్‌ను వాడటం ఉత్తమం. నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఇలా క్రమంగా శుభ్రం చేసుకుంటే మీ స్విచ్ బోర్డులు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరిసిపోతాయి.
