
వర్షాకాలంలో లేదా చలికాలంలో వేడివేడిగా అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి, జీర్ణక్రియ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి. కానీ, ఆరోగ్యానికి మంచిదని రోజూ పదేపదే లేదా అధిక మొత్తంలో అల్లం టీ తాగడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్లంలో ఘాటుదనం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తి కావడం, కడుపులో మంట, అల్సర్లు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
అల్లం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఇప్పటికే లో-బీపీ సమస్య ఉన్నవారు లేదా బీపీ, షుగర్ మందులు వాడేవారు ప్రతిరోజూ అతిగా అల్లం టీ తాగడం వల్ల బిపి, షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది.
అల్లం సహజంగా రక్తాన్ని పలుచబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. సర్జరీ కాబోతున్నవారు లేదా బ్లడ్ థిన్నర్ మందులు వాడుతున్నవారు అల్లం టీ ఎక్కువగా తాగితే గాయాలు అయినప్పుడు రక్తస్రావం కావడం ఆగదు.
అతిగా అల్లం తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణవ్యవస్థ గుండా వెళ్తుంది. ఇది విరేచనాలకు దారితీస్తుంది. అలాగే, టీలో అల్లం ఘాటు ఎక్కువైతే నోటి భాగంలో, నాలుకపై మంట, బొబ్బలు లేదా చిరాకు కలుగుతుంది.
గర్భధారణ సమయంలో ఉదయాన్నే వచ్చే వాంతులు తగ్గడానికి అల్లం తోడ్పడినప్పటికీ, దానిని రోజువారీగా ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భస్రావం లేదా కాన్పు సమయంలో రక్తస్రావం అయ్యే ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 3 నుండి 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదు. రోజుకు 1 లేదా 2 కప్పుల అల్లం టీ సరిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా క్రమంగా మందులు వాడుతున్నవారు అల్లం టీని పరిమితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా మేరకు పాటించడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..