
పూజకు ఉపయోగించిన పూలు ఎండిపోయాక పారేయకుండా వాటితో ఇంట్లోనే అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఎండిన పూలతో సువాసనగల అగర్‌బత్తీలు లేదా ధూప్ స్టిక్స్, ఆర్గానిక్ సబ్బులు, ఫ్యాన్సీ రెసిన్ ఆర్ట్ వస్తువులు, అలంకరణ కొవ్వొత్తులు, ఆరోగ్యకరమైన హెర్బల్ టీలను సులువుగా చేయవచ్చు. ఇవి ఇంటికి అందాన్ని, సువాసనను ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఉపయోగపడతాయి. పూజ పూలను వృథా చేయకుండా తిరిగి ఉపయోగించుకోవడానికి చక్కటి, వినూత్నమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఎండిన పూల రెక్కలను సేకరించి మిక్సీ జార్‌లో వేయాలి. అందులో కొద్దిగా పచ్చకర్పూరం పొడి, ఆవు నెయ్యి లేదా హవన్ సామాగ్రి పొడి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కోన్ లేదా స్టిక్ ఆకారంలో ఒత్తుకుని ఎండబెడితే పవిత్రమైన సువాసన ఇచ్చే హోమ్‌మేడ్ అగర్‌బత్తీలు సిద్ధమవుతాయి.
మీరు ఇంట్లో వాడే సబ్బును సన్నగా తురిమి, కాస్త వేడి చేసి కరిగించాలి. అందులో ఎండిన గులాబీ లేదా మందార పూల రెక్కలను కలిపి మోల్డ్‌లో పోసి గడ్డకట్టనివ్వాలి. ఇవి చర్మానికి మంచి తేమను అందించడంతో పాటు సహజమైన సువాసనను ఇస్తాయి.
ఎండిన పూలతో అందమైన రెసిన్ ఆర్ట్ వస్తువులను తయారు చేయవచ్చు. కోస్టర్లు, కీచైన్లు, ఫ్రేమ్‌లు లేదా ఆభరణాల తయారీలో ఎండిన రంగురంగుల పూలను అమర్చి, వాటిపై రెసిన్ లిక్విడ్ పోస్తే గట్టిపడి ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులుగా మారతాయి.
కెమికల్స్ లేని గులాబీ, మందార వంటి పూల రెక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని నీటిలో వేసి మరిగించి, వడగట్టిన తర్వాత తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరానికి యాంటీఆక్సిడెంట్లు లభించి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సాధారణ మైనాన్ని కరిగించి అందులో ఎండిన పూల రెక్కలను కలపవచ్చు. లేదా కొవ్వొత్తి తయారయ్యాక దాని చుట్టూ ఎండిన పూలను అంటించి ఆకర్షణీయమైన డిజైనర్ కాండిల్స్‌గా మార్చుకోవచ్చు. ఇవి ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఈ విధంగా పూజ పూలను వృథా చేయకుండా ఇంటిని అందంగా, సువాసనభరితంగా మార్చుకోవచ్చు. వీటిని విక్రయించటం ద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..