
మనలో చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కడుపు నొప్పి ప్రధానమైంది. తీసుకున్న ఆహారంలో మార్పులు వచ్చినా, సరైన ఆహారం తీసుకోకపోయినా వెంటనే కడుపు నొప్పి వేధిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పిని లైట్ తీసుకుంటుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా కడుపు నొప్పి కొన్ని ప్రమాదకర వ్యాధులకు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే కారణం వల్ల కడుపు నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* పొత్తికడుపులో నిరంతరం నొప్పి ఉంటే, అది మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కావచ్చని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. శరీరంలో కాల్షియం శాతం పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ని చిన్న రాళ్లు మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అయితే పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం కడుపు నొప్పికి దారి తీస్తుంది. నడుములో భరించలేని నొప్పిని కలిగిస్తుంది.
* ఇక మహిళలల్లో బుతుక్రమ సమయంలో కూడా పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి వస్తుంది. పొత్తికడుపు కింది భాగంలో రెండు భాగాల్లో ఈ నొప్పి కనిపిస్తుంది. చాలా మంది మహిళల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు వికారం లేదా వాంతులు, విరేచనాలు తలనొప్పికి కారణమవుతుంది.
* ఇక కడుపు నొప్పికి మరో ప్రధాన కారణం ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. సింపుల్‌గా చెప్పాలంటే పేగులో వ్యర్థాలు అడ్డుకోవడంగా చెబుతారు. దీని వల్ల పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పిని కలుగుతుంది. దీని వల్ల విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
* నాభి పైన దీర్ఘకాలంగా నొప్పి ఉంటే దానికి కణితి కారణమని భావించాలి. కడుపులో వాపు లేదా ద్రవం ఉత్పత్తి కూడా క్యాన్సర్ వల్ల సంభవించవచ్చు. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలుగా చెబుతున్నారు.
* పొత్తికడుపు కుడి దిగువ భాగంలో నిరంతర నొప్పితో బాధపడుతుంటే, అది అపెండిసైటిస్‌కు సంకేతం కావచ్చు. అపెండిక్స్ అనేది పెద్ద ప్రేగు దగ్గర ట్యూబ్ లాంటి నిర్మాణం, దీనిలో మంట అపెండిసైటిస్ ప్రారంభమవుతుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం వంటివి దీని ప్రారంభ లక్షణాలుగా చెప్పొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..