
మద్యం తాగేవారికి లివర్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా తాగేవారి లివర్ కొవ్వుతో నిండిపోయి ఉంటుంది. కానీ మందు తాగని వారి కాలేయంలోనూ కొవ్వు ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం. దీర్ఘకాలిక కొవ్వు కాలేయంలో వాపు ప్రమాదాన్ని పెంచుతుంది. సిర్రోసిస్ లేదా కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధులను పెంచుతుంది. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ కాలక్రమేణా ఇది కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల మంట, మచ్చలు ఏర్పడతాయి. అంటే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ లేదా కాలేయ వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు ఫ్యాటీ లివర్ టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో స్థిరమైన అలసట, బరువు పెరగడం, కడుపులో బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలను తెలుసుకుందాం..
ఫ్యాటీ లివర్‌కు చెడు ఆహారపు అలవాట్లు అతిపెద్ద కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేయించిన ఆహారాలు, అధిక కేలరీల ఫుడ్ కాలేయంలో కొవ్వును పెంచుతాయి. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని వేగవంతం చేస్తాయి. అటువంటి ఆహారాలను ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల లివర్ సహజ డిటాక్సీఫై ప్రక్రియ బలహీనపడుతుంది.
అధిక బరువు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి టైప్-2 డయాబెటిస్, ఇతర జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా కాలేయంపై ఒత్తిడిని మరింత పెంచుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని కేలరీలు కొవ్వుగా మారి కాలేయంలో పేరుకుపోతాయి. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడి సమయంలో పెరిగే కార్టిసాల్ హార్మోన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.
హెల్దీ ఫుడ్ తినాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవద్దు.
ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
బరువును అదుపులో ఉంచుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి.
ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..