
Telugu Proverb Meaning: తెలుగు భాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ సామెతల్లో లోతైన అర్థం ఉంటుంది. మన పూర్వీకులు తమ జీవిత అనుభవాలను, సమాజంలో జరిగే సంఘటనలను చిన్న చిన్న మాటల్లోనే సామెతల రూపంలో అద్భుతంగా వివరించారు. అలాంటి సామెతల్లో ఒకటి “కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు”. ఈ సామెతను మనం రోజువారీ జీవితంలోనూ తరచూ వింటుంటాం. ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు భావం ఏమిటో తెలుసుకుందాం.
ఈ సామెతలోని అంతరార్థం ఏమిటంటే.. ఒక వ్యక్తి తన పనిని తాను సక్రమంగా చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే.. మరో వ్యక్తి వచ్చి అతడిని చెడగొట్టడం లేదా అతని పనికి ఆటంకం కలిగించడం. అంటే సజావుగా సాగుతున్న పనిలో అనవసరంగా జోక్యం చేసుకుని సమస్యలు సృష్టించే వ్యక్తులను ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. గడ్డి మేయడం గాడిదకు కడుపు నింపే మంచి పని.. అయితే మరో అరిచే గాడిద వచ్చి దాని పనికి భంగం కలిగింది ఆహారం లేకుండా చేసిందని ఈ సామెత వివరిస్తుంది.
ఒక వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ఉంటాడు. ఇలాంటి సమయంలో మరో వ్యక్తి వచ్చి అనవసరమైన సలహాలు ఇవ్వడం, చెడు అలవాట్లు నేర్పించడం లేదా అతడిని తప్పుదారి పట్టించడం చేస్తే ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే ఒక టీమ్‌లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే, బయట నుంచి వచ్చిన వ్యక్తి తన మాటలతో లేదా ప్రవర్తనతో వారి మధ్య గొడవలు సృష్టించినప్పుడు కూడా ఈ సామెతను వర్తింపజేస్తారు.
అలాగే ఒక విద్యార్థి సరిగ్గా చదువుతూ ఉంటే.. మరో విద్యార్థి అతని పనికి భంగం కలిగించిన సందర్భంలోనూ ఈ సామెతను వాడుతారు.
మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇతరుల అనవసర జోక్యానికి ప్రభావితం కాకుండా ఉండాలనేది ఈ సామెత ఇచ్చే సందేశం. అలాగే ఇతరులు ప్రశాంతంగా తమ పని చేసుకుంటున్నప్పుడు మనం అనవసరంగా జోక్యం చేసుకుని వారి పనులకు ఆటంకం కలిగించకూడదు.