
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గుడ్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు తీవ్ర ప్రమాదం ఉందని, అది క్యాన్సర్‌కు దారితీస్తుందని జరుగుతున్న ప్రచారం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని సర్వోదయ ఆసుపత్రి చీఫ్ డైటీషియన్ డాక్టర్ మీనా కుమారి ఈ పుకార్లపై స్పందించి వాస్తవాలను వెల్లడించారు. డాక్టర్ మీనా కుమారి వివరణ ప్రకారం, గుడ్లు అత్యంత సురక్షితమైనవి, చౌకగా లభించే పోషకాహారం. గుడ్లలో ఉండే హై-క్వాలిటీ ప్రోటీన్ కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ, డి, ఇ, బి12, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీని పెంచడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోగులకు, పిల్లలకు నిరభ్యంతరంగా గుడ్లు ఇవ్వవచ్చని ఆమె స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న AOZ గురించి డాక్టర్ స్పష్టత ఇచ్చారు. AOZ అనేది నైట్రోఫ్యూరాన్ అనే యాంటీబయాటిక్ అవశేషం. అయితే భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో కోళ్ల ఫారాలలో నైట్రోఫ్యూరాన్ వాడకంపై పూర్తి నిషేధం ఉంది. కాబట్టి సాధారణంగా లభించే గుడ్లలో ఇది ఉండే అవకాశం లేదని ఆమె తేల్చి చెప్పారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కూడా దీనిపై స్పందించింది. కొన్ని అరుదైన సందర్భాల్లో చాలా తక్కువ స్థాయిలో వీటి జాడలు కనిపించినా, అవి మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణం కావని స్పష్టం చేసింది.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. గుడ్లు తినడానికి, క్యాన్సర్‌కు ఎటువంటి సంబంధం లేదు. క్యాన్సర్ అనేది ప్రధానంగా జీవనశైలి, ధూమపానం, ఊబకాయం వంటి కారణాల వల్ల వస్తుంది. ఆరోగ్యవంతులు: రోజుకు 1 నుండి 2 గుడ్లు తినవచ్చు. మధుమేహం లేదా గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో, తమ కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి పరిమితంగా తీసుకోవాలి. ఐసియులో ఉన్న రోగులకు, క్యాన్సర్ బాధితులకు కూడా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్ కోసం గుడ్లను ఆహారంగా ఇస్తారని డాక్టర్ మీనా కుమారి గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మి పౌష్టికాహారానికి దూరం కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు ఆరోగ్యానికి రక్షణ కవచమే తప్ప ప్రమాదకారి కాదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..