ప్రయాణాల్లో ఉన్నప్పుడో, హాస్టల్‌లో ఉన్నప్పుడో లేదా అకస్మాత్తుగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడో మనకు వెంటనే గుర్తొచ్చేది హోటల్ తిండి. కానీ, మీ దగ్గర ఒక చిన్న 'ఎలక్ట్రిక్ కెటిల్' ఉంటే చాలు.. గ్యాస్ స్టౌతో పని లేకుండానే ఐదు నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవచ్చు. టీ, కాఫీ నీళ్లు మరిగించడానికే కాదు, వంటలు చేయడానికి కూడా కెటిల్ ఒక అద్భుతమైన పరికరం అని మీకు తెలుసా?
చదువు కోసం బయట ఉండే విద్యార్థులు లేదా ఉద్యోగ రీత్యా బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండేవారికి ఎలక్ట్రిక్ కెటిల్ ఒక మినీ కిచెన్ లాంటిది. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో దీనిలో రకరకాల వంటలు చేసుకోవచ్చు. చిన్న పరికరమే అయినా ఎలక్ట్రిక్ కెటిల్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సరైన పద్ధతిలో వాడితే అత్యవసర సమయాల్లో ఇది మీ ఆకలిని తీర్చడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఇంటి వంటను మీకు అందిస్తుంది.
ఏం వండవచ్చు?
ఆరోగ్యకరమైన ఓట్స్ & దలియా : కెటిల్‌లో పాలు లేదా నీటిని మరిగించి అందులో ఓట్స్ వేసి కొద్దిసేపు ఉంచితే చిక్కటి, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారవుతుంది. అలాగే గోధుమ రవ్వ కూడా సులభంగా ఉడికించుకోవచ్చు.
ఉడికించిన గుడ్లు : కెటిల్‌లో తగినన్ని నీళ్లు పోసి గుడ్లు వేసి ఆన్ చేస్తే చాలు.. పది నిమిషాల్లో ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం.
నూడుల్స్ & ఇన్స్టంట్ ఉప్మా : బ్యాచిలర్స్ ఫేవరెట్ ‘మ్యాగీ’ నూడుల్స్ వండటానికి కెటిల్ బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు వేయించిన రవ్వను ఉంచుకుంటే, మసాలాలు కలిపి వేడి నీటిలో ఇన్స్టంట్ ఉప్మా కూడా చేసుకోవచ్చు.
కార్న్ చాట్ : స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు) కెటిల్‌లో వేసి ఉడికించి, పైన కొద్దిగా నిమ్మరసం, ఉప్పు చల్లుకుంటే హెల్తీ స్నాక్ రెడీ అవుతుంది.
బ్రెడ్ పుడ్డింగ్ : తీపి ఇష్టపడేవారు బ్రెడ్ ముక్కలు, పాలు, చక్కెర కలిపి కెటిల్‌లో వేడి చేస్తే రుచికరమైన బ్రెడ్ అండ్ బటర్ పుడ్డింగ్ తయారవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కెటిల్‌ను ఉపయోగించిన ప్రతిసారీ వెంటనే శుభ్రం చేయాలి. ముఖ్యంగా పాలు లేదా నూడుల్స్ వండినప్పుడు అడుగు భాగం మాడిపోకుండా చూసుకోవాలి.
కెటిల్‌లో నేరుగా ఎక్కువ నూనె వేసి తాలింపులు వేయకూడదు. ఇది కెటిల్ పనితీరును దెబ్బతీస్తుంది.
మరీ గట్టిగా ఉండే పదార్థాలు కాకుండా, నీటిలో త్వరగా ఉడికే వాటిని మాత్రమే ఎంచుకోవాలి.