
ఇంటిని ఎంత అందంగా సర్దుకున్నా, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్లపై దుమ్ము పేరుకుపోతే ఇల్లంతా కళావిహీనంగా కనిపిస్తుంది. అయితే ఫ్యాన్లను శుభ్రం చేయడమంటే ఇంట్లో అందరికీ పెద్ద తలనొప్పే. స్టూల్ లేదా నిచ్చెన ఎక్కి, పొడవాటి చీపురుతో తుడిస్తే.. ఆ దుమ్మూధూళి అంతా కళ్లు, ముఖంపై పడటమే కాకుండా కింద ఉన్న నేలపై రాలి ఇల్లంతా మురికిగా మారుతుంది. అలర్జీ, తుమ్ములతో బాధపడేవారికైతే ఇదొక పెద్ద టాస్క్. కానీ ఇంట్లో నిరుపయోగంగా పడి ఉండే ఒక పాత వస్తువుతో.. దుమ్ము కిందపడకుండా ఐదు నిమిషాల్లో సీలింగ్ ఫ్యాన్‌ను మెరిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
దానికి కావాల్సింది మరేదో కాదు.. మీ బీరువాలో మూలనపడ్డ ఒక పాత దిండు కవర్. సాధారణంగా చీపురుతో దులిపినప్పుడు గాలికి దుమ్ము అంతా గది నలుమూలలా వ్యాపిస్తుంది. అదే దిండు కవర్‌ను ఉపయోగించినప్పుడు, ఫ్యాన్ బ్లేడ్లపై ఉన్న దుమ్ము మొత్తం ఆ కవర్ లోపలే బంధీ అయిపోయి.. కింద పడదు.
ముందుగా ఒక స్ప్రే బాటిల్‌లో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో కొద్దిగా లిక్విడ్ సోప్, కొన్ని చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పాత దిండు కవర్ లోపలి భాగం కొద్దిగా తేమగా అయ్యేలా స్ప్రే చేయండి.
ఇప్పుడు సురక్షితమైన ప్రదేశంలో నిలబడి, ఫ్యాన్ రెక్క పూర్తిగా లోపలికి వెళ్లేలా దిండు కవర్‌ను తొడగండి.
దిండు కవర్ పైభాగాన్ని, కింది భాగాన్ని మీ చేతులతో బ్లేడ్‌కు అదిమిపట్టి, నెమ్మదిగా బయటకు లాగండి. దీనివల్ల బ్లేడ్‌పై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము మొత్తం దిండు కవర్ లోపలి వైపునకు అంటుకుని.. బ్లేడ్ సరికొత్తగా మెరుస్తుంది.
మిగిలిన రెక్కలను కూడా ఇదే పద్ధతిలో శుభ్రం చేస్తే, నిమిషాల వ్యవధిలోనే ఫ్యాన్ క్లీనింగ్ పూర్తవుతుంది.
పని పూర్తయిన తర్వాత ఆ దిండు కవర్‌ను బయటకు తీసుకెళ్లి దులిపి, వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై ప్రమాదకరంగా నిచ్చెనలెక్కడం, ఇల్లంతా దుమ్ముమయం చేసుకోవడం వంటి తిప్పలు లేకుండా ఈ స్మార్ట్ ఐడియాతో పనిని ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చు.