
మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్రం పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణకుడు ఉత్తమ పరిష్కారాలను చూపారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో స్పష్టంగా తెలియజేశారు. ఆయన చెప్పిన అనేక మాటలు ఇప్పటికీ అనుసరణీయంగా ఉంటాయి. సమాజంలో రెండు రకాలైన వ్యక్తులు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరు మంచి స్వభావం గలవారు అని.. ఇక రెండోవారు చెడు స్వభావం గలవారు. మంచి వారు తమతోపాటు ఇతరులకు కూడా మంచి చేస్తుంటారు. చెడ్డవారు మాత్రం తమ మంచి గురించే ఆలోచిస్తూ ఇతరులకు హాని చేస్తుంటారు. మంచివారు శాశ్వత ఆనందం కోసం ప్రయత్నిస్తుంటే.. చెడ్డవారు మాత్రం తాత్కాలిక ఆనందం కోసమే జీవిస్తుంటారు. అందుకే మనం జీవితంలో అలాంటి వ్యక్తులను అనుసరించకపోవడమే మంచిదని చెబుతున్నారు చాణక్యుడు. వారిని ఎందుకు అనుసరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వార్థపరులను ఎప్పుడూ అనుకరించవద్దని ఆచార్య చాణక్యుడు తెలిపారు. స్వార్థపరులు ఎప్పుడూ తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారని.. ఏదో ఒక రోజు వారు పెద్ద ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నారు. అందుకే అలాంటివారిని అనుసరిస్తే.. మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఒక వ్యక్తి డబ్బు, అధికారం మొదలైన వాటి గురించి గర్వపడితే.. మీరు పొరపాటున కూడా అలాంటి వారిని అనుసరించవద్దు. ఎందుకంటే ఈ విషయాలు ఒక వ్యక్తికి ఎక్కువ కాలం ఉండవు. కానీ, మీ అహంకారం కారణంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీకు దూరం అవుతారు. అందుకే అలాంటి వ్యక్తులను అనుకరించవద్దని చాణక్యుడు సూచిస్తున్నారు.
కొందరు ఏ పనీ చేయకుండా ఊరికే కూర్చుంటారు. ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. ఇలాంటి వారిని కూడా అనుకరించవద్దని చాణక్యుడు చెబుతున్నారు. సోమరులను అనుసరించడం వల్ల మీరు ఏదో ఒకరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు.
తమ పని పట్ల నిజాయితీ లేని వ్యక్తులను ఎప్పడూ అనుకరించకూడదని చాణక్యుడు చెబుతున్నారు. వారిని అనుకరిస్తే మీరు ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. నిజాయితీ లేకుండా ఉంటే.. ఎవరూ మిమ్మల్ని నమ్మరు. అంతేగాక, సమాజంలో మీకు విలువ ఉండదు అని స్పష్టంగా చెబుతున్నారు.
అబద్ధాలు చెప్పే వ్యక్తులను కూడా అనుకరించవద్దని చాణక్యుడు సూచిస్తున్నారు. అబద్ధాలు చెప్పేవారు తాత్కాలికంగా సమస్యల నుంచి బయటపడతారు. కానీ, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అందుకే అలాంటి వారిని అనుకరిస్తే మీరూ కూడా పెద్ద ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. అందుకే జీవితంలో మీరు మంచివారిగానే ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు. అలా ఉంటే మీకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతూనే ఉంటుందన్నారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారాన్ని అందుబాటులో వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)