Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు! అవేంటో తెలుసా?

జీవితంలో విజయం సాధించాలని అందరూ అనుకుంటారు. కానీ, కొందరు మాత్రమే విజయతీరాలకు చేరుకుంటారు. అయితే, విజయం సాధించేందుకు రెండు గుణాలు కీలకమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఈ రెండు గుణాలు ఉంటే మీరు మీ జీవితంలో ఏది చేసినా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ రెండు సుగుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు! అవేంటో తెలుసా?
Chanakya

Updated on: Jan 12, 2026 | 2:02 PM

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవుడు తన జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలను స్పష్టం తెలియజేశారు. అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. జీవితంలో విజయం, పరాజయం రెండూ ఉంటాయని చెప్పారు. అయితే, విజయాన్ని మాత్రమే అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగినట్లుగా మాత్రం వారి పనులు ఉండవు. విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు తప్పకుండా కలిగి ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు.

చాలా మంది విజయం సాధించాలని ఒక పనిని ప్రారంభిస్తారు కానీ, మొదటి ప్రయత్నంలో విఫలం ఎదురుకాగానే దానిని వదిలేస్తుంటారు. కొందరు రెండోసారి ప్రయత్నిస్తారు. మరికొందరు విజయం సాధించేవరకూ దాన్ని వదలిపెట్టారు. అందుకే ప్రయత్నం మానేసినవారు ఎప్పటికీ విజయం సాధించలేరని చాణక్యుడు చెబుతారు. ఒక వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటే అతను తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోడని చెబుతున్నారు. ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం.

వినయం
వినయం అనేది ఒక మంచి గుణం. అది మీవైపు ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి మీకు ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. నీళ్లు తోడుకోవడానికి బావిలోకి బకెట్ దించినప్పుడు.. ఆ బకెట్ ముందుగా వంగాలి. అలా వంగినప్పుడు మాత్రమే నీరు దానిలోకి ప్రవేశిస్తుందని చాణక్యుడు తెలిపారు. వినయం కూడా అలాంటి గుణం.

మనం వినయంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. విద్యార్థులు ఎల్లప్పుడూ వినయంతో జ్ఞానాన్ని అంగీకరించాలి. సేవకులు లేదా వ్యాపారవేత్తలు ఎల్లప్పుడూ తలపై మంచు, నోటిలో చక్కెర కలిగి ఉండాలని.. అంటే ఆలోచనలు ప్రశాంతంగా, మాటలు తియ్యగా వినయం కలిగి ఉండాలని చాణక్య చెప్పాడు. ఒక వ్యక్తి ఎంత బలంగా ఉన్నా.. అతని శరీరంలో వినయం లేకపోతే, అతని ఓటమి ఖాయం అని చాణక్య స్పష్టం చేస్తున్నారు.

ఓర్పు

ఒక వ్యక్తికి అవసరమైన మరో గుణం సహనం(ఓర్పు) అని చాణక్యుడు చెప్పారు. ఒక వ్యక్తికి ఓర్పు ఉంటే ఏ పరిస్థితులోనైనా గెలవగలడని ఆయన చెబుతున్నారు. పదే పదే వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా.. కొంచెం వేచి ఉండాలని, ఓర్పు వహించాలని అంటున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఉత్సాహంగా పని చేయడం ప్రారంభించాలని చాణక్యుడు స్పష్టం చేస్తున్నారు. అందుకే మనిషి జీవితంలో వినయం, ఓర్పు అనేవి రెండు ముఖ్యమైన గుణాలని చెబుతున్నారు. ఈ రెండు కలిగివున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమి చవిచూడడని స్పష్టం చేస్తున్నారు.

Note: ఈ వార్తలోని సమాచారం అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి, పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.