
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో గోప్యత, వివేకం ప్రాముఖ్యతను వివరించారు. వివేకవంతులు తమ వ్యక్తిగత ఆలోచనలు, రహస్యాలలో కొన్నింటిని ఎవరితోనూ పంచుకోరని ఆయన చెప్పారు. మీరు కూడా జీవితంలో విజయం సాధించి, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఈ కింది ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా సన్నిహిత మిత్రులు, ప్రియమైనవారితో సహా వ్యక్తిగత రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని చాణఖ్యుడు హెచ్చరిస్తున్నాడు. ఏ రహస్యాలను పంచుకోవడం హానికరమో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు, బలాలు ఉంటాయి. కానీ మీరు వాటిని ఎవరికైనా చెబితే వారు దానిని తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇలాంటి వాటి వల్ల మీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మీ బలహీనతల గురించి ఎవరికీ చెప్పకండి.
ఒకవేళ మీరు ఆర్థిక నష్టం గురించి ఎవరికైనా చెబితే ప్రజలు మీ ఆర్థిక పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తారు. మీ నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం కూడా ఉంది.
ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు మీ మనసులో ఏదైనా దుఃఖం ఉంటే, దానిని ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే కొందరు మీ ముందు మీ దుఃఖానికి సానుభూతి చూపిస్తారు. కానీ మీ వెనుక నవ్వుతారు. ఇతరుల ముందు మీ నిస్సహాయ పరిస్థితిని చూసి ఎగతాళి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీ కుటుంబంలోని బలహీనతలు, కుటుంబ కలహాలు, విభేదాలను ఇతరులకు తెలియజేయడం వల్ల మీ కుటుంబ పరువు దెబ్బతినవచ్చు. లేదా మీ కుటుంబ పరిస్థితిని ఎవరైనా తమకు అనుకూలంగా వాడుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మీ కుటుంబ సమస్యల గురించి ఎవరికీ చెప్పవద్దు.
మీ కలలు, ప్రణాళికలు, లక్ష్యాలను అవి పూర్తయిన తర్వాత మాత్రమే ఇతరులతో పంచుకోవాలి. అంతకంటే ముందే మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెబితే వారు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి లేదా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల మీ లక్ష్యాలు, తదుపరి చర్యల గురించి ఎవరికీ చెప్పవద్దని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నారు.