
అందమైన, నిగనిగలాడే జుట్టు సామాన్యులకైనా, ముఖేష్ అంబానీ ముద్దుల కుమార్తెకైనా అందరి అందాన్ని పెంచుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీల నుండి పెద్ద వ్యాపారవేత్తల వరకు, అందరికీ అందమైన, స్టైలిష్ హెయిర్‌స్టైల్స్‌ను అందించే చాలా మంది నిపుణులు సరైన కేశ సంరక్షణపై ఎల్లప్పుడూ విలువైన సలహాలు ఇస్తుంటారు. అదేవిధంగా, ఇషా అంబానీ హెయిర్‌స్టైలిస్ట్ యియాని త్సపటోరి జుట్టు ఆరోగ్యం గురించి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. మనం జుట్టు కడుక్కునేటప్పుడు తరచుగా ఒక పెద్ద తప్పు చేస్తుంటాము. దానిని మనం అస్సలు పట్టించుకోము. కానీ, ఈ ఒక్క పొరపాటు మన జుట్టును లోపలి నుండి పూర్తిగా బలహీనపరిచి, దెబ్బతీయడానికి కారణమవుతుందని ఈ హెయిర్‌స్టైలిస్ట్ అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
తలస్నానంలో చేసే అతిపెద్ద పొరపాటు!: చాలామంది షాంపూను బాటిల్ నుండి నేరుగా చేతిలోకి తీసుకుని, తల మాడ పై పోసి గట్టిగా రుద్దుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు! ఎందుకంటే.. షాంపూలో గాఢత ఎక్కువగా ఉంటుంది. నేరుగా మాడపై వేయడం వల్ల కుదుళ్లు బలహీనపడి, చర్మం పొడిబారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం పెరుగుతుంది. సరైన పద్ధతి ఏంటంటే.. షాంపూను ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీటితో కలిపి నురుగు వచ్చాక మాత్రమే తలకు పట్టించాలి.
చాలా మందికి వేడి నీటి స్నానం అంటే ఇష్టం. ఇది శరీర అలసటను తగ్గించడమే కాకుండా, మనసుకు లోపలి నుండి విశ్రాంతినిస్తుంది. కానీ, వేడి నీరు జుట్టులోని సహజ నూనెలను తొలగించి, జుట్టును జీవం లేకుండా చేస్తుంది. కాబట్టి మీ జుట్టును మృదువుగా, పట్టులా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, తలస్నానానికి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు లేదా చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. గోరువెచ్చని నీరు జిడ్డును తొలగిస్తే, చల్లటి నీరు కుదుళ్లను లాక్ చేసి జుట్టుకు మెరుపును ఇస్తుంది.
అందమైన, దృఢమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం, తల చర్మం కూడా ఆరోగ్యంగా ఉండాలని హెయిర్ స్టైలిస్ట్ పియాని అన్నారు. ఇందుకోసం తలస్నానం చేసేటప్పుడు మన వేళ్ల సహాయంతో షాంపూతో తల చర్మాన్ని నెమ్మదిగా మసాజ్ చేయాలని ఆ హెయిర్ స్టైలిస్ట్ చెప్పారు. ఇలా చేయడం వల్ల తల చర్మంపై పేరుకుపోయిన నూనె, దుమ్ము, మురికి, చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ పెరగడానికి కూడా సహాయపడుతుంది. తల చర్మాన్ని శుభ్రపరచడానికి, మసాజ్ చేసేటప్పుడు తల వెనుక భాగంలోని పైభాగాన్ని కూడా సరిగ్గా శుభ్రపరచాలి. ఇకపోతే, కండిషనర్‌ను తల మాడకు రాయకూడదు. దీనిని కేవలం జుట్టు మధ్యభాగం నుండి చివర్ల వరకు మాత్రమే అప్లై చేయాలి. కుదుళ్లకు రాయడం వల్ల మాడ జిడ్డుగా మారి కుదుళ్లు వదులవుతాయి.
చివరగా, తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం లేదా వెంటనే దువ్వెనతో దువ్వడం చేయకూడదు. తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి త్వరగా తెగిపోతుంది. మెత్తటి మైక్రోఫైబర్ టవల్‌తో నీటిని సున్నితంగా ఒత్తుకోవాలి. మీ రోజువారీ హెయిర్ వాష్ అలవాట్లలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టు ఊడటాన్ని తగ్గించి, ఒత్తైన, మరియు కాంతివంతమైన కేశాలను పొందవచ్చు!