
స్మార్ట్‌ఫోన్‌లు, గేమింగ్ పరికరాల అతివాడకం వల్ల మణికట్టుపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేడు విద్యార్థులు, ఐటీ నిపుణులలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ముప్పును ఎలా గుర్తించాలి? చేతివేళ్లలో తిమ్మిర్లు, మణికట్టులో భరించలేని నొప్పితో సతమతమవుతున్నారా? ఇది కేవలం అలసట అనుకుంటే పొరపాటే! ఆధునిక జీవనశైలిలో యువతను వేధిస్తున్న ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ లక్షణాలు ఏంటి? దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరి మణికట్టులో ‘కార్పల్ టన్నెల్’ అనే ఒక సన్నని మార్గం ఉంటుంది. దీని గుండా ‘మీడియన్ నర్వ్’ అనే ముఖ్యమైన నరం వెళ్తుంది. డిజిటల్ పరికరాలను గంటల తరబడి ఉపయోగించడం, నిరంతర టైపింగ్, ఫోన్ స్క్రోలింగ్ లేదా గేమింగ్ ఆడటం వంటి పనుల వల్ల మణికట్టుపై ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలో ఆ నరంపై ఒత్తిడి పెరిగి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుంది.
ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం
దీనిని నిర్లక్ష్యం చేస్తే, మీడియా నరంపై ఒత్తిడి కొనసాగి దీర్ఘకాలిక నొప్పి, కండరాల బలహీనత మరియు శాశ్వతంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ కృష్ణ హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మరియు కంప్యూటర్ వినియోగంలో ఎర్గోనామిక్ పద్ధతులు పాటించని వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ.
మణికట్టు నొప్పి లేదా వేళ్లలో తిమ్మిరిని ‘సాధారణ అలసట’ అని భావించి లైట్ తీసుకోవద్దు. లక్షణాలు కొనసాగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. సరైన సమయంలో చికిత్స, పని చేసే విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు.