
భారతీయ సంస్కృతిలో వివాహిత మహిళలకు మంగళసూత్రం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అది వారి పవిత్ర బంధానికి నిలువెత్తు రూపం. సాంప్రదాయకంగా మంగళసూత్రాన్ని బంగారంతోనే తయారు చేసినప్పటికీ.. ఇటీవలి కాలంలో వెండి మంగళసూత్రాలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు మహిళలు వెండితో చేసిన మంగళసూత్రాన్ని ధరించవచ్చా? శాస్త్రాలు దీనిని అంగీకరిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో వెండి మంగళసూత్రాలు ఒక సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. ఇవి తేలికగా ఉండటం, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు ధరించడానికి సౌకర్యవంతంగా ఉండటం వీటి ప్రధాన ప్లస్ పాయింట్. అంతేకాకుండా మోడ్రన్, సాంప్రదాయ దుస్తులతో ఇవి సులభంగా సెట్ అవుతాయి. వెండి, నల్ల పూసలు, ఆకర్షణీయమైన డిజైనర్ పెండెంట్ల కాంబినేషన్‌లో సరికొత్త మోడల్స్ ఇప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. బడ్జెట్ పరంగానూ ఇవి అందరికీ అందుబాటు ధరలో ఉంటున్నాయి.
హిందూ సంప్రదాయంలో వెండికి ప్రత్యేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. వెండి అనేది చంద్రుడికి ప్రతీక అని.. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుందని నమ్ముతారు. కాబట్టి శాస్త్రాల ప్రకారం వెండి మంగళసూత్రాన్ని ధరించడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే సాంప్రదాయక నమ్మకాల ప్రకారం పెళ్లి సమయాల్లో ఎక్కువగా బంగారు మంగళసూత్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. బంగారం అనేది శ్రేయస్సుకు, శుభప్రదానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావించడమే దీనికి కారణం. అందుకే ఇప్పటికీ చాలా కుటుంబాలు పెళ్లి తంతులో బంగారు సూత్రాలనే వాడుతుంటారు.
కుటుంబంలో లేదా సమాజంలో నిర్దిష్టమైన మతపరమైన ఆచారాలు, కఠినమైన సంప్రదాయాలు ఉంటే తప్ప.. వెండి మంగళసూత్రాన్ని ఎంచుకోవడం అనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. నేటి తరం మహిళలు తమ బడ్జెట్, డిజైన్ మరియు నిత్యం వేసుకోవడానికి వీలుగా ఉండే సౌకర్యాన్ని బట్టి వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
మంగళసూత్రం అసలైన గుర్తింపు అది ఏ లోహంతో తయారైంది అనే దానిపై ఆధారపడి ఉండదు. దాని వెనుక ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక ప్రాముఖ్యతే అత్యంత కీలకమైనది. భార్యాభర్తల మధ్య ఉండే నిఖార్సైన ప్రేమ, నమ్మకం, సహచర్యం, జీవితకాల బంధానికి ఇది ఒక అద్దం పడుతుంది. పెళ్లి రోజున తీసుకున్న ఏడడుగుల ప్రమాణాలకు గుర్తుగా నిలిచే మంగళసూత్రం, వెండిదైనా, బంగారానిదైనా మహిళల హృదయానికి ఎప్పుడూ ప్రత్యేకమైనదే.