
మన శరీరంలో అతిపెద్ద వడపోత కర్మాగారం ఏదైనా ఉందంటే అది కాలేయం మాత్రమే. శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, పోషకాలను ప్రాసెస్ చేయడం, జీవక్రియను నియంత్రించడం వంటి వందలాది పనులను ఇది నిరంతరం చేస్తూనే ఉంటుంది. అయితే ఆధునిక జీవనశైలిలో మనం చేసే అతిపెద్ద తప్పు.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. ముఖ్యంగా నిద్రకు, కాలేయానికి ఉన్న సంబంధాన్ని విస్మరించడం వల్ల ప్రాణాంతక సమస్యలు కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య కాలేయం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సమయంలోనే శరీరం తనను తాను శుద్ధి చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఆ సమయంలో మేల్కొని ఉంటే కాలేయం తన పనిని సక్రమంగా చేయలేదు. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, కాలేయ కణాలలో వాపు సంభవిస్తుంది.
మద్యం సేవించే వారికే కాలేయ సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు.. నిరంతరం నిద్ర లేకపోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుంది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా మద్యం సేవించని వారిలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
సరైన సమయానికి నిద్ర: వీలైతే రాత్రి 10 నుండి 11 గంటల మధ్యలో నిద్రపోవడానికి ప్రయత్నించండి. కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.
డిజిటల్ డిటాక్స్: పడుకునే గంట ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టేయండి. స్క్రీన్ల నుండి వచ్చే కాంతి నిద్రను దూరం చేస్తుంది.
తేలికపాటి ఆహారం: రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం ముగించాలి.
గోరువెచ్చని నీరు: భోజనం తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు త్వరగా తొలగిపోతాయి.
సోమరితనం వద్దు: ఆహారం, నిద్ర, వ్యాయామం విషయంలో క్రమశిక్షణ పాటించకపోవడం కాలేయాన్ని చంపడంతో సమానమని గుర్తించండి.