
తరచుగా అలసట, నీరసం మహిళలను వేధిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం. ఐరన్ శరీరంలో రక్తం ఉత్పత్తికి, ఆక్సిజన్ సరఫరాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తగ్గితే రక్తహీనత వస్తుంది. దీనివల్ల అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
ఆకుకూరలలో ఐరన్ అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర లాంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. బీట్‌రూట్‌లో ఐరన్‌తో పాటు, విటమిన్ సి ఉంటుంది. ఇది ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తరచుగా తాగడం మంచిది.
ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీర్ లాంటి డ్రై ఫ్రూట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో ఐరన్, ఇతర పోషకాలు అధికం. ప్రతిరోజు ఉదయం కొన్ని ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష తినండి. కందులు, పెసలు, శనగలు లాంటి పప్పుల్లో కూడా ఐరన్ ఉంటుంది. బెల్లంలో ఐరన్ చాలా అధికం. భోజనం తర్వాత బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గుమ్మడి గింజలు, నువ్వులు, బాదం లాంటి వాటిలో కూడా ఐరన్ ఉంది. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను విటమిన్ సి ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవాలి. ఉదాహరణకు, నిమ్మరసం, ఉసిరి లాంటివి. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఇవి ఐరన్ శోషించబడటాన్ని అడ్డుకుంటాయి