
ఆయుర్వేదం కేవలం వ్యాధులను నయం చేయడమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అనుసరించాలో కూడా బోధిస్తుంది. ఈ మధ్యకాలంలో అందరినీ వేధిస్తున్న భూతం డయాబెటిస్. ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది షుగర్‌తో బాధపడుతున్నారు. దీన్ని నియంత్రణకు ఆహారం, ఔషధం, జీవనశైలి అనే మూడు ముఖ్యమైన అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారికి ఆహారం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం.. నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
తృణ, చిరుధాన్యాలు: బార్లీ, గోధుమ, పాత బియ్యం, సజ్జలు, జొన్నలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా బార్లీ, బరువును తగ్గించడంతో పాటు రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా చూస్తుంది.
చేదు, వగరు రుచులు: కాకరకాయ, వేప, తులసి, ఉసిరి, మెంతి వంటి చేదు, వగరు రుచులున్న పదార్థాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి.
పండ్లు: నేరేడు, బొప్పాయి వంటి పండ్లు కూడా షుగర్ లెవెల్స్ నియంత్రణలో సహాయపడతాయి. నేరేడు పండ్లలోని కొన్ని పదార్థాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధిస్తాయి.
మధుమేహ నియంత్రణకు ఆయుర్వేదంలో ఎన్నో సహజసిద్ధమైన మూలికలు ఉన్నాయి.
ఔషధ మూలికలు: మెంతులు, వేప, పసుపు, ఉసిరి, దాల్చిన చెక్క వంటివి రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూలికలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
ఆహారంతో పాటు, సరైన జీవనశైలిని పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు యోగా, నడక, ఈత వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది.
నిద్ర: రోజుకు 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. తక్కువ నిద్ర వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి షుగర్ లెవెల్స్ అధికమవుతాయి.
ఒత్తిడి నియంత్రణ: ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం.
కొవ్వు పదార్థాలు, వేయించినవి, చల్లటి ఆహారాలు, పాలు, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగాళదుంపలు, మైదా ఉత్పత్తులు వంటివి తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ తాజాగా, వేడిగా వండిన ఆహారాన్ని తినడం జీర్ణక్రియకు మంచిది.
ఆయుర్వేదం సూచించిన ఈ మూడు సూత్రాలను పాటిస్తే, మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ పద్ధతులను అనుసరించి ఆరోగ్యంగా ఉండవచ్చు.
(NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..