
దుమ్ము, ధూళి వల్ల చర్మం నిర్జీవంగా మారితే, రెండు చెంచాల పెసరపిండిలో సరిపడా బాదం నూనె కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత మృదువుగా రుద్దుకుని కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

స్నానం చేసేముందు శరీరానికి బాదం నూనెను రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. దీని ద్వారా చర్మం తేమను కాపాడుకోగలదు. బాదం నూనెలో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చి, పొడిదనాన్ని తగ్గిస్తాయి.

చిన్న వయస్సులోనే ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపించడం చాలా మందికి సమస్యగా మారుతోంది. బాదం నూనెలో యాంటీ-ఏజింగ్ గుణాలు ఉండటంతో ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రోజూ చర్మానికి ఈ నూనెను అప్లై చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

కాలుష్యం, ఎండ ప్రభావం వల్ల చర్మం డల్‌గా మారితే బాదం నూనెను అప్లై చేయడం ద్వారా సహజ రంగును తిరిగి పొందవచ్చు. ఇది సన్‌స్క్రీన్‌లా పనిచేసి ఎండకు అనుగుణంగా చర్మాన్ని రక్షిస్తుంది.

కళ్ల కింద నల్లటి వలయాల సమస్య ఉందా..? అయితే రాత్రి నిద్రకు ముందు కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని కళ్ల కింద మృదువుగా మసాజ్ చేయాలి. ఈ విధంగా రోజూ చేస్తుంటే కొన్ని రోజుల్లోనే వలయాలు తగ్గిపోతాయి.

పొడిబారిన, చిట్లిపోయిన జుట్టు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీని పరిష్కారానికి సమపాళ్లలో బాదం నూనె, ఆముదం, ఆలివ్ నూనెలను కలిపి తలకు పెట్టాలి. మృదువుగా కుదుళ్లను మసాజ్ చేయడం ద్వారా జుట్టు మెత్తగా బలంగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఇది చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పొడిబారిన చర్మం, పగిలిన మడమలు సమస్యగా ఉంటే రాత్రి నిద్రకు ముందు బాదం నూనెను అప్లై చేసి మర్దన చేయాలి. దీంతో చర్మం మృదువుగా మారి మడమల పగుళ్లు తగ్గిపోతాయి.